స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి

-కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి
-పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పోస్టల్ బ్యాలెట్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-నామినేషన్ల పరిశీలనలో నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, నామినేషన్ల పరిశీలన, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో మంగ‌ళ‌వారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా క‌మిష‌న‌ర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం గతంలో కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్‌కు పట్టే సమయాన్ని ముందుగానే అంచనా వేసి, అవసరమైన మేరకు టేబుళ్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి, తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

ఏకగ్రీవ ఎన్నికల వివరాలు

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 19 శాతం వరకు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, సుమారు 36 శాతం వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమావేశంలో వివరించారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, నిబంధనల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.

మిగిలిన దశల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

మొదటి, రెండు, మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అవసరమైన పోలీసు బలగాలను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు తగిన భద్రతా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

కలెక్టర్లు, ఎస్పీల కృషి అభినందనీయం

ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు చేస్తున్న కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభినందించారు. ప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను క‌లెక్ట‌ర్లు స్వయంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయడాన్ని అభినందించారు. అదేవిదంగా ఎస్పీలు కూడా ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అదేవిధంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపిన వెంటనే స్పందించి పరిష్కరించడం అభినందనీయమన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌పై సమీక్ష

ఎన్నికల షెడ్యూల్‌ను వివరిస్తూ నవంబర్ 26వ తేదీన 23 పట్టణ స్థానిక సంస్థలు, 26 జిల్లాల్లో (విశాఖ‌ప‌ట్ట‌ణం, గుంటూరు మిన‌హా) గ్రామ పంచాయతీలకు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. అదే రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయన్నారు. నవంబర్ 30వ తేదీన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. నవంబర్ 29వ తేదీన రెండవ దశ, డిసెంబర్ 2వ తేదీన గ్రామ పంచాయతీల మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబర్ 5వ తేదీన 23 పట్టణ స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించడంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రతి అధికారి తూచా తప్పకుండా పాటించాలని పునరుద్ఘాటించారు. గ్రామ పంచాయతీల్లో ౩ వ దశ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసినందున, తదుపరి అవసరమైన భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు.

రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ…

పోస్టల్ బ్యాలెట్లపై ప్రత్యేక శ్రద్ధ

పోస్టల్ బ్యాలెట్లలో చెల్లని ఓట్ల సంఖ్య అధికంగా నమోదవుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, దీనికి గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి సరైన శిక్షణ అందించడంతోపాటు, ఓటు వేసే విధానంపై ఓటర్లకు స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులైన ఓటర్లకు ఓటు వేసే విధానాన్ని వివరించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అయితే, ఓటు వేసే సమయంలో అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తుల విషయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రీకౌంటింగ్ విషయంలో నిబంధనలే ప్రామాణికం

రీకౌంటింగ్ అభ్యర్థనలపై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితాలు ప్రకటించి, రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత మళ్లీ రీకౌంటింగ్ చేపట్టాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు చర్యలు

గ్రామ పంచాయ‌తీల్లోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 650 మంది ఓటర్లు మించకుండా నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేయాలని, ఒకే లొకేషన్ లో ఉన్న పోలింగ్ కేంద్రాలను మాత్రమే హేతుబద్దీకరించాలన్నారు. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను నిబంధనలకు అనుగుణంగా ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. అయితే, పోలింగ్ కేంద్రాల మార్పులు, సర్దుబాట్లపై ఓటర్లకు ముందుగానే విస్తృతంగా సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

బ్యాలెట్ పేపర్ల ముద్రణ, భద్రతపై అప్రమత్తత

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వాటి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ, భద్రత విషయంలో కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు, ఎన్నికల గుర్తుల ముద్రణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తుది జాబితా ఖరారయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సీసీటీవీ నిఘా, ఫుటేజ్ భద్రతకు ప్రాధాన్యత

పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఎన్నికల పిటిషన్ల పరిష్కారం, సంబంధిత న్యాయపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని కనీసం 60 రోజుల పాటు భద్రపరచాలని సూచించారు. ఏదైనా ఎన్నికల పిటిష‌న్ దాఖ‌లై, ఎలక్షన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మాత్రమే ఫుటేజ్‌ను సంబంధిత న్యాయస్థానానికి సమర్పించాలే తప్ప, వ్యక్తులకు నేరుగా కాపీలు అందించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున స్పష్టం చేశారు.

ఐజీ బి. రాజకుమారి మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా పూర్తి భద్రత కల్పించాలని, ఎలాంటి బెదిరింపులు, దాడులు, భయభ్రాంతులకు తావులేకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆమె పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

మొబైల్ పోలీసు బృందాలతో నిరంతర నిఘా

సంబంధిత జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు తమ పరిధిలోని అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఐజీ సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో తగినన్ని మొబైల్ పోలీసు బృందాలను ముందుగానే మోహరించాలని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి సమయాల్లో కూడా ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

బయటి వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు

ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బస చేస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. 23 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌కు మ‌రియు మొద‌టి ద‌శలో ఎన్నిక‌ల‌కు వెళ్లే గ్రామ పంచాల‌య‌తీల‌కు 24.11.2026 సాయంత్రం 5 గంట‌ల‌తో ప్ర‌చార కార్య‌క్ర‌మం ముగుస్తున్నందున‌, బ‌య‌ట ప్రాంతాల వారు లాడ్జీలు, హోటళ్లు, షెల్టర్ హోమ్‌లు, తదితర ప్రాంతాల్లో బ‌స‌ చేసారేమో తనిఖీలు నిర్వహించి, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తుల విషయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన

అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారులను నేరుగా సంప్రదించే అవకాశం కల్పించాలని, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి అవసరమైన భద్రత కల్పించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రతి ఫిర్యాదును స్వీకరించి, బాధితులకు భరోసా కల్పించాలని తెలిపారు. అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు స్వేచ్ఛగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేశారు.
ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌లు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఐజీ బి. రాజకుమారి ఆదేశించారు.

వీడియో కాన్ఫ‌రెన్స్ లో శాంతి, భ‌ద్ర‌త‌ల ఏడీజీ మ‌ధుసూద‌న్ రెడ్డి, సీడీఎమ్ ఏ డా. పి. సంప‌త్ కుమార్‌, పంచాయ‌తీ రాజ్ కమిష‌న‌ర్ ఎమ్‌. కృష్ణ తేజ, వివిధ జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు, పోలీసుక‌మిష‌న‌ర్లు, ఎస్సీలు పాల్గొన్నారు.