అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని రాణిగారితోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందడంతో పాటు అయ్యప్ప మాలధారులు, భక్తులతో కలిసి కొంతసేపు ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు.
అనంతరం గురుస్వామి మధు నంబూద్రి దేవినేని అవినాష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమ్మరి నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, బిక్షాల్ రెడ్డి, బేతపూడి జనార్ధన్, కొమిరి రమేష్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు హాజరై పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.