-విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం
-గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని కలెక్టర్‌కు దిశానిర్దేశం
-మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ సహకారం తీసుకోవాలని సూచన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
కాకినాడ జిల్లా, యు.కొత్తపల్లి మండల పరిధిలోని సుబ్బంపేటకు చెందిన మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, చేపడుతున్న గాలింపు చర్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ నుంచి బయలుదేరి వేటకు వెళ్లారనీ, 10వ తేదీ విశాఖ హార్బర్ కు చేరుకుని తమ వద్ద ఉన్న చేపలు విక్రయించి, 10వ తేదీ తిరిగి సముద్రంలోకి వెళ్లినట్టు కలెక్టర్ తెలిపారు. 14వ తేదీ వరకు ఫోన్లో తమ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉన్నారని, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని కలెక్టర్ వివరించారు. అయితే ఈ నెల 18వ తేదీ వరకు మత్స్యకారులు వెళ్లిన బోటు పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించిందని, ఆ తర్వాత కనబడకుండా పోయిందని విచారణలో తేలింది. సమాచారం అందిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించామని, వెంటనే కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్టు గార్డు అధికారులను సంప్రదించి, గాలింపు చేపట్టినట్టు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే నేవీ హెలీకాప్టర్ సహాయంతో కూడా గాలింపు చేపట్టినట్టు చెప్పారు. బంగ్లాదేశ్, మయన్మార్ కోస్టు గార్డులకి సైతం సమాచారం ఇచ్చినట్టు, బోటులో వెళ్లిన ఏడుగురి మొబైల్ ఫోన్లు మనుగడలో లేవని, బోటుకు అమర్చిన జీపీఎస్ ట్రాన్స్ పాండర్ కూడా ఆన్ చేయకపోవడం వల్ల పని చేయడం లేదని వివరించారు.
మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ సహకారంతో సముద్రంలో అణువణువు జల్లెడ పట్టాలని స్పష్టం చేశారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేయాలని కలెక్టర్‌కు సూచించారు. మత్స్యకారులను రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
