ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలను డిసెంబర్ 21లోగా సమర్పించాలి…

-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన రెండవ సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ (ఎన్నికైనవారు, ఓటమి చెందినవారు) తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన తుది వివరాలను ఈ నెల 21వ తేదీలోగా తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం 2026 నవంబర్ 7వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 230-B ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా తన ఎన్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, ఎన్నికల నిర్వహణ నియమావళి-2006లోని రూల్ 100(2) ప్రకారం, సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయం ద్వారా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి ఈ వివరాలను అందజేయాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించేందుకు 2026 డిసెంబర్ 21వ తేదీ చివరి గడువుగా నిర్ణయించబడిందని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల తుది వివరాలను సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించని అభ్యర్థులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 19-B ప్రకారం, ఎన్నికల ఖర్చుల వివరాలను గడువులోగా సమర్పించని అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతకు గురవుతారని తెలిపారు. అటువంటి అభ్యర్థి ఎన్నికై ఉంటే, తన ఎన్నికైన పదవిని కూడా కోల్పోతారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో గెలిచినవారు, ఓడిపోయినవారు అనే తేడా లేకుండా పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ విషయంపై ప్రజలకు, అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు స్థానిక పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సంబంధిత ఎంపీడీవోలు అభ్యర్థుల నుంచి ఎన్నికల వ్యయ వివరాలను స్వీకరించి, గడువులోగా సమర్పించేలా వారిని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కావున, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎలాంటి ఆలస్యం చేయకుండా తమ ఎన్నికల వ్యయ వివరాలను 2026 డిసెంబర్ 21వ తేదీలోగా సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజ్ఞప్తి చేశారు.