గ్రంథాలయ ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం

-59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో వక్తలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడ బందర్ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమకారుల సేవలపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమకారులైన అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయాల అభివృద్ధికి వారు చేసిన విశేష సేవలను వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ రిటైర్డ్ ప్రొఫెసర్ అయ్యంకి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, లయోలా కళాశాల విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు సభాధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ మహిళా కళాశాల లైబ్రేరియన్ పి. మల్లిక మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి అయ్యంకి వెంకట రమణయ్య చేసిన కృషిని వివరించారు. ఆర్. శివరామకృష్ణయ్య పాతూరి నాగభూషణం ప్రారంభించిన బోటు గ్రంథాలయాల విశేషాలను తెలియజేశారు. కేబీఎన్ కళాశాల లైబ్రేరియన్ శ్రీనివాస్ ఎస్.ఆర్. రంగనాథన్ ప్రతిపాదించిన గ్రంథాలయ శాస్త్రంలోని ఐదు నియమాలను వివరించారు. లయోలా కళాశాల పీజీ లైబ్రేరియన్ డాక్టర్ టి. రోజామణి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ రంగానికి అందించిన సేవలను కొనియాడారు.
ముఖ్య అతిథి అయ్యంకి మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకోవడానికి చదవాలని, నాయకత్వం వహించడానికి నిరంతరం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ ఆయుధం కన్నా అక్షరం ఎంతో విలువైనదని, సమాజంలో విజ్ఞాన వికాసానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్ధార్థ మహిళా కళాశాల, కేబీఎన్ కళాశాల, లయోలా కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు ఠాగూర్ స్మారక గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, సేవల గురించి గ్రంథాలయ అధికారిణి కె. రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిగ్రీ విద్యార్థులకు క్విజ్ పోటీలు, సిరి సంగీత విభావరి నిర్వహించారు.