Breaking News

భారీగా పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు

-కట్టుబడి, రవాణా ఛార్జీలూ భారమే

-బేజారవుతున్న సామాన్యులు

సామాన్యులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను భవన నిర్మాణ సామగ్రి ధరలు చిదిమేస్తున్నాయి. ప్రతి రూపాయి కూడబెట్టి ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ఖర్చు తడిసిమోపెడై పనులు మధ్యలో నిలిచిపోతున్నాయి. స్థానిక బిల్డర్లు ప్రారంభించిన వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులకు తాత్కాలికంగా విరామమిస్తున్నారు. ఈ పరిస్థితిపై అటు నిర్మాణదారులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కంపెనీలు మాత్రం సామగ్రికి కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నాయి. గత కొద్ది రోజుల్లోనే సిమెంటు, ఉక్కు, ఇటుక, విద్యుత్తు, ప్లంబింగ్‌ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గడిచిన మూడు నెలలుగా వీటి ధరలు ప్రతినెలా సగటున 10- 20 శాతం పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల్లో చూస్తే 30 శాతం హెచ్చాయి. మార్కెట్లో డిమాండ్‌ లేకున్నా కరోనా పేరిట ధరలు పెంచేందుకు నిర్మాణ సామగ్రి సరఫరాదారులు సిండికేట్‌ అవుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని స్థిరాస్తి వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

కృత్రిమ కొరత సృష్టించి..

మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి నిర్మాణ సామగ్రి కంపెనీలు, సరఫరాదారులు ధరలు పెంచుతున్నారు. సిమెంట్‌ కంపెనీలు ప్రతినెలా పది రోజుల పాటు ఉత్పత్తి, సరఫరా నిలిపివేస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ధరలు పెరిగేలా చేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు సిమెంట్‌ బస్తా ధర రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.380కి చేరింది. సాధారణ కేటగిరీ ఉక్కు టన్ను ధర నెల రోజుల క్రితం రూ.52,500 ఉంటే తాజాగా రూ.56వేలకు చేరింది. బ్రాండెడ్‌ ఉక్కు ధర రూ.66వేలు దాటింది. ఉక్కు ధరలు నెలాఖరు నాటికి టన్నుపై కనీసం మరో రూ.3వేల వరకు పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్మాణంలో కీలకమైన కంకర ధరలు పెంచేందుకు సరఫరాదారులు గత వారం రోజులుగా సమ్మె పేరిట కొరత సృష్టించారు. దీంతో మార్కెట్‌లో కంకర ధర టన్ను ఒక్కసారిగా 35శాతం వరకు పెరిగింది. వేసవికాలం కావడంతో ఇసుక లభ్యత ఎక్కువగా ఉండి ధరల్లో వ్యత్యాసం టన్నుకు రూ.100-150 వరకు పరిమితమైంది.

కట్టలేనంత కష్టం…

కట్టుబడి వ్యయం పైపైకి పెరుగుతుంది. గత ఏడాది చదరపు అడుగుకు కట్టుబడి వ్యయం రూ.190 నుంచి రూ.220 మధ్య ఉంటే ప్రస్తుతం రూ.250-280కి చేరింది. డీజిల్‌ ధరలు పెరగడంతో సామగ్రి రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. నిర్మాణ సామగ్రి తరలించేందుకు డీసీఎం, లారీ యజమానులు గతంలో కనీస ఛార్జి రూ.800లు వసూలు చేస్తే ప్రస్తుతం రూ.1600 తీసుకుంటున్నారు. నిర్మాణంలో కీలకమైన విద్యుత్తు, ప్లంబింగ్‌ పైపుల ధరలు రెండింతలయ్యాయి. విద్యుత్తు వైర్ల ధరలు 60 శాతం వరకు పెరిగాయి.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *