-కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల భద్రత, వార్డుల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లపై కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం రెండవ సాధారణ పురపాలక ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలింగ్ అనంతరం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రా లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి తరలించే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, బ్యాలెట్ బాక్సులను వార్డుల వారీగా అమర్చే విధానం, కౌంటింగ్ ప్రక్రియకు అనుకూలంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ సమయంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బ్యాలెట్ బాక్సులను సులభంగా గుర్తించి కౌంటింగ్ టేబుళ్లకు తరలించే విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
వార్డుల వారీగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయడం, ఆయా వార్డులకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను క్రమబద్ధంగా అమర్చడం, కౌంటింగ్ సిబ్బందికి బ్యాలెట్ పత్రాలను సక్రమంగా అందజేసే విధానం, కౌంటింగ్ రౌండ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది విధుల కేటాయింపు, వారికి కేటాయించిన ప్రదేశాలు, కౌంటింగ్ టేబుళ్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు.
అదేవిధంగా కౌంటింగ్ విధుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సిబ్బంది బస్సుల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందిని తీసుకువచ్చే బస్సులు కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో సులభంగా చేరుకునేలా, సిబ్బంది దిగిన వెంటనే బస్సులు త్వరగా వెళ్లిపోయే విధంగా పార్కింగ్ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, సిబ్బంది సకాలంలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.
అనంతరం కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ టేబుళ్లు, సిబ్బంది కూర్చునే ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల భద్రత, స్ట్రాంగ్ రూముల నిర్వహణ, కౌంటింగ్ కేంద్రంలో సిబ్బంది రాకపోకలు, అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను అధికారులు సమన్వయంతో పర్యవేక్షిస్తూ, కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ తెలిపారు.
ఈ పర్యటనలో మేయర్ ఆర్ ఓ మరియు హౌసింగ్ పీడీ రజనీకుమారి, చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి చీఫ్ సిటీ ప్లానర్ కే సంజయ్ రత్నకుమార్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
