మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సిబ్బందికి ఎన్నికల శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు రెండవ సాధారణ పురపాలక ఎన్నికలు–2026 నేపథ్యంలో శనివారం గవర్నర్‌పేటలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఎన్నికల సిబ్బంది శిక్షణ నోడల్ అధికారి డాక్టర్ డి. హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మొత్తం 732 మంది మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల మాస్టర్ ట్రైనర్లు క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ అందించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన చర్యలు, కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలు, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, నిబంధనలను మాస్టర్ ట్రైనర్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.