59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహించనున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బ్రోచర్‌ను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. ఇలకియా IAS నవంబర్ 12న తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా వారం రోజులపాటు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చదరంగం, చిత్రవిచిత్ర వేషధారణ, దేశభక్తి గీతాలు తదితర పోటీలు నిర్వహించనున్నారు. అలాగే పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనాలు, సాహిత్య కార్యక్రమాలు, మహిళా చర్చావేదికలు, అవగాహన సదస్సులు, పురస్కార ప్రదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
నవంబర్ 20న ముగింపు వేడుకల్లో వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.