తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
2022 -23 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక మేరకు వివిధ రంగాలలో వంద శాతం రుణాలను బ్యాంకర్లు తప్పనిసరి మంజూరు చేయాలని జె.సి. డి.కె.బాలాజీ సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా సంప్రదింపుల కమిటీ (డి.సి.సి) త్రైమాసిక సమీక్ష సమావేశం చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ లీడ్ బ్యాంక్ కన్వీనర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో జిల్లా అధికారులతో, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లతో వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు. జె.సి. మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలలో రుణాల మంజూరు త్రైమాసానికి 131 శాతంగా ఉందని అభినందించదగ్గ విషయమని అన్నారు. ఎం.ఎస్.ఎం.ఈ లకు సంబంధించి బ్యాంకర్లు దృష్టి పెట్టాలని 44 బ్రాంచ్ లు ఉన్న కెనరా బ్యాంకు 32 శాతం, 13 బ్రాంచ్ లు ఉన్న ఐ.ఓ.బి. 13 శాతం మంజూరు చేశారని మార్చి 2023 ఆఖరుకు వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. విద్యా రుణాలకు సంబంధించి జిల్లాలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ బ్యాంకులు కలిపి 57 శాతం మాత్రమే మంజూరు చేశారని విద్యకు ప్రాధాన్యతను ఇచ్చి అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తిచేయాలని అన్నారు. పి.ఎం. స్వానిధి, ఫిష్ ఆంధ్ర పథకాలకు రుణాల మంజూరు చేయాలని అన్నారు. ప్రధానంగా గూడూరు వద్ద టిడ్కో గృహాల రుణాలకు సంబంధించి ఎస్.బి.ఐ. నందు 44, బి.ఓ.బి. నందు 25 పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని ఇవి స్థిరాస్తులు మీ వద్ద ఉంచుతారు కావున త్వరగా మంజూరు చేయాలని సూచించారు. పాడి పశువులకు, డయిరీ, ఫుడ్ ప్రాడక్ట్ లకు సంబంధించి రుణాల మంజూరుకు సహకారం అందించాలని ఈ పథకాలు కూడా పి.ఎం. స్వానిధి క్రిందికి వస్తుందని అన్నారు.
జిల్లా ఎస్.పి. వారి ఆదేశాలతో సంబందిత సైబర్ క్రైం బ్రాంచ్ అధికారులు వివరిస్తూ జిల్లాలో 628 కేసులు నమోదు అయ్యాయని దాదాపు రూ.29 కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద ఫ్రీజింగ్ చేశామని వాటికి సంబంధించి మీ పరిధిలో బాధితులకు త్వరగా రీయింబర్స్ మెంట్ జరిగేలా పోలీస్ అధికారులకు సహకారం అందించాలని, సైబర్ క్రైం నేరాలకు సంబంధించి బ్యాంకర్ల సహకారంతో జరిపిన కార్యక్రమాలకు ఎస్.పి. పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయమన్నారని వివరించారు.
ఈ సమీక్షలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్.సుభాష్, ఆర్.బి.ఐ. ప్రతినిధి శ్రీమతి పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆర్.ఎం. జి.రాం ప్రసాద్, ఇండియన్ బ్యాంక్ డి.జి.ఎం. శ్రీమతి అరుణ, నాబార్డ్ డి.డి.ఎం. సునీల్, ఎస్.జి.బి. ఆర్.ఎం. జయకుమార్, ఎ.పి.జి.బి. ఆర్.ఎం. శైలేంద్రనాథ్, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల జిల్లా కో-ఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.