మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు
సోమవారం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణం లోని జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్ నుండి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి పోలైన 21,139 పోస్టల్ బ్యాలెట్ లను భద్రపరిచిన 33 ట్రంకు పెట్టెలను ప్రత్యేక వాహనంలో జిల్లా ఎన్నికల అధికారి, డిఆర్ఓ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సమక్షంలో కృష్ణ విశ్వవిద్యాలయానికి గట్టి పోలీసు బందోబస్తు నడుమ తరలించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా ఒక ప్రత్యేక వాహనాన్ని పోస్టల్ బ్యాలెట్ వాహనం వెంబడి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వచ్చే జూన్ 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం మొదటి రాండమైజేషన్ ద్వారా సిబ్బందిని నియమించామని, నాలుగు బ్యాచులుగా విభజించి ఈరోజు సోమవారం, మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మొదటి విడత శిక్షణ తరగతులను సోమవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామన్నారు. మరలా రిటర్నింగ్ అధికారుల సమక్షంలో రెండోసారి రాండమైజేషన్ ద్వారా రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామన్నారు. ఓట్ల లెక్కింపుకు కావలసిన సామాగ్రినంత ఇప్పటికే సిద్ధం చేసుకున్నామన్నారు. పోటి చేస్తున్న అభ్యర్థులతో సమన్వయం చేసుకొని వారికి అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నామన్నారు.
మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి తన కౌంటింగ్ హాల్ వద్ద పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు కోసం 14 టేబుళ్ళు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో వారికి నమోదైన పోస్టల్ బ్యాలెట్ ల సంఖ్యను బట్టి రెండు నుంచి 8 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలవుతుందన్నారు. అనంతరం 8-30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మ ప్రారంభమవుతుందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యలోగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు కూడా పూర్తవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణ విశ్వవిద్యాలయంలో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మొదటి అంచలో కేంద్ర సాయుధ బలగాలు రెండవ అంచలో రాష్ట్రస్థాయిలో సాయుధ బలగాలు, మూడవ అంచలో జిల్లా పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల స్థితిగతులను పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి తరపు ఏజెంట్లు పరిశీలించేందు కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అక్కడి నుండి సీసీ కెమేరాల ద్వారా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఇప్పటికే మూడు పర్యాయాలు పోటీ చేస్తున్న అభ్యర్థులను స్ట్రాంగ్ రూముల దగ్గరికి తీసుకువెళ్లి భద్రత ఏర్పాట్లను చూపించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, పోస్టల్ బ్యాలెట్ మడల్ అధికారి షాహిద్ బాబు జనసేన, వైఎస్ఆర్సిపి, ఐ ఎన్ సి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల ప్రతినిధులు గరికపాటి సాంబశివరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, కోక ఫణిభూషణ్, కే జగదీష్ ఇండిపెండెంట్ అభ్యర్థులు గూడవల్లి వెంకట కేదారేశ్వర రావు, దామోదర్, ధణేకుల గాంధీ తదితరులు పాల్గొన్నారు.