Breaking News

పిఠాపురం, భీమవరం నియోజక వర్గాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక

-స్థానిక సంస్థలతోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోజు రోజుకీ పెరుగుతున్న ఘన, ద్రవ వ్యర్థాల మూలంగా గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయనీ.. శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక సంస్థలతో కలసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పని చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యాచరణను ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో అమలులోకి తీసుకురావాలన్నారు. తమ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకొనేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు, ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చే విధానాలను వారికి తెలియచేయాలన్నారు. పర్యావరణంపై మక్కువ ఉన్నవారిని ఏకో వారియర్స్ గా ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
డంపింగ్ యార్డుల సమస్య నగరాలు, పట్టణాల్లోనే కాకుండా మేజర్ పంచాయతీల్లోనూ తలెత్తుతున్న విషయం ఇప్పటికే తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్  తెలిపారు. భీమవరం పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డు సమస్య తీవ్రతను స్వయంగా చూసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అక్కడి అనారోగ్యకర పరిస్థితుల వల్ల పరిసర గ్రామాల వారూ ఇబ్బందిపడుతున్నారనీ, వ్యర్థాల నిర్వహణ, డంపింగ్ యార్డుల విషయంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. జల వనరులైన నది పరీవాహక ప్రాంతాలు, కాలువలు, చెరువుల వెంబడి చెత్త వేసే విధానాలను ఆపి వేయాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారనీ, జల కాలుష్యం ఏర్పడుతున్నందున జల వనరుల నదులు, కాలువలు, చెరువుల గట్లను చెత్త వేసే కేంద్రాలుగా మార్చవద్దనీ, అదే విధంగా ప్రజలు, వాణిజ్య సంస్థల వాళ్ళు అక్కడ వ్యర్థాలు వేయకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్., అధికారులకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఎస్.ఎల్.ఆర్.ఎం. ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.శ్రీనివాసన్ కలిసి గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుపై ఒక నివేదికను అందచేశారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *