Breaking News

తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది

-తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం
-హైదరాబాద్ లో టీడీపీ చేసిన అభివృద్ధిని తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయి
-తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకుని అభివృద్ధి చెందాలి
-గొడవలతో కాదు చర్చలతో విభజన సమస్యలు పరిష్కారం కావాలి
-ఏపీని విధ్వంసం చేసిన భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం
-మరొక జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా
-టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
-ముఖ్యమంత్రిగా నాలుగో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు
-చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలంగాణ నేతలు, కార్యకర్తలు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుజాతి ఉన్నంత వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. నాలుగో సారి సీఎం అయ్యాక తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నా గెలుపు కోసం తెలంగాణలోని కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది తెలంగాణ గడ్డపైనే అని గుర్తు చేశారు. అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంటే కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల సమక్షంలోనే పార్టీకి తెలుగుదేశం అని నామకరణం చేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మళ్లీ టీడీపీకి తెలంగాణ గడ్డపై పూర్వవైభవం వస్తుందనిపిస్తోందని అన్నారు. ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ, ఏపీ నాకు రెండు కళ్లు లాంటివి. రెండు ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ పని చేస్తోంది. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలనే ఆలోచించా… చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుజాతి కోసం పని చేస్తానని ఈ సంధర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుజాతి ఉంటుంది
తెలుగు జాతికి ఎన్టీఆర్ గారు గౌరవం తెచ్చారు. తెలుగు వారిని ప్రపంచానికి చాటి చెప్పి ఆత్మగౌరవాన్ని పెంచారు. కరణం, పటేల్ పట్వారీ వ్యవస్థలను అన్న ఎన్టీఆర్ గారే రద్దు చేసి అనేక సంస్కరణలను తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేయడంతో తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం వచ్చిందన్న సంతోషంలో ఉన్నట్లు చంద్రబాబు గారు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన వర్గాలు బాగు పడ్డాయంటే అది ఎన్టీఆర్ చొరవతోనే అని గుర్తు చేసిన ఆయన పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి సంక్షేమానికి నాంది పలికినట్లు వివరించారు. 2004 నుండి 20 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తల్లో పట్టుదల ఏమాత్రం తగ్గలేదని అన్నారు. టీడీపీ పట్ల కార్యకర్తల్లో రోజురోజుకూ అభిమానం పెరుగుతోందని.. నాయకులు పోయినా కార్యకర్తలు ఇప్పటికీ పసుపు జెండాని విడవలేదని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం జెండా ఈ ప్రాంతంపై రెపరెపలాడుతుంది. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారని హర్షం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్, పీవీ తెలుగుగడ్డపై పుట్టిన వారే
తెలుగుజాతి కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. నాతో పాటు నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా తిరుగులేని శక్తిగా ఎదిగాం. నన్ను ఏ కారణం లేకుండా జైల్లో పెట్టారు. నా అరెస్టు సమయంలో హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ ఎప్పుడూ మర్చిపోలేను. గచ్చిబౌలిలో లక్షల మంది వచ్చి మద్దతుగా నిలిచారు. నేను చేసిన అభివృద్ధికి గాను సంఘీభావం ప్రకటించారు. తెలుగుజాతి ఎప్పుడూ ఎన్టీఆర్ ను మర్చిపోదని అన్నారు. దేశానికి దశదిశను చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు గారిని మననం చేసుకున్న చంద్రబాబు నాయుడు, ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంతో పాటు సంపద సృష్టి ఆయన కాలంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎన్టీఆర్, పీవీ తెలుగుగడ్డపైనే పుట్టారు. రాజకీయమంటే సొంత వ్యాపారం చేసుకోవడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాదు..ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం నిజమైన రాజకీయమని వీరిరువురు నిరూపించినట్లు చెప్పారు.

కలిసి పని చేస్తే రెండు రాష్ట్రాలకు లాభం
టీడీపీ ముందు..తర్వాత తెలుగు వారి చరిత్రను పరిశీలించవచ్చు. 1995 ముందు ఒక్కసారి హైదరాబాద్ ను చూడండి. హైటెక్ సిటీతో హైదరాబాద్ నూ అభివృద్ధి చేశాం. నేడు హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్. దీనికంటే నాకు ఏం తృప్తి కావాలి? ఔటర్ రింగ్ రోడ్డు పనులు కూడా నాడు నేనే ప్రారంభించా. విమానాశ్రయాన్ని ముందు చూపుతో నిర్మించాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. నేడు నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్ నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్యనున్న సమస్యలు పరిష్కరించుకుందామని నేనే రేవంత్ రెడ్డికి లేఖ రాశానని అన్నారు. మనం విడిపోయినా సమస్యలపై అన్నదమ్ముల్లా పోరాడి ఐకమత్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కలిసి పని చేస్తే రెండు రాష్ట్రాలు లబ్ధిపొందుతాయని అన్నారు. ఏ సమస్య వచ్చినా జాతి ప్రయోజనాలను కాపాడటానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు. గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని కొందరు అంటున్నారు. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యలు పరిస్కారం కావు, అభివృద్ధి జరగదు..లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని.. సానుకూల చర్చల ద్వారానే ముందుకు నడవాలి హితవు పలికారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే అంతకంటే ఉత్తమం మరొకటి లేదు. అభివృద్ది రాజధానితో ప్రారంభమైతే రాష్ట్రం నలుమూలకు విస్తరిస్తుంది. తలసరి ఆదాయం విభజన సమయంలో 35 శాతం వ్యత్యాసం ఉంది. 2014 నుండి 2019 వరకు కష్టపడి 27 శాతానికి తగ్గించాను. తర్వాత వచ్చిన విధ్వంస ప్రభుత్వం వల్ల మళ్లీ 44 శాతానికి పెరిగింది. విభజనతో జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వ పాలన వల్లే ఎక్కువ నష్టం కలిగిందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత అధికంగా తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఏపీ ఇబ్బందుల్లో ఉంది. మళ్లీ ఏపీని కూడా గట్టెక్కించే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నాడు విజన్ గురించి మాట్లాడితే ఎగతాలి చేశారు… విజన్ 2020 అంటే 420 అని మాట్లాడారు. 2047 నాటికి మన దేశం ప్రపంచంలోనే నెంబర్-1 గా ఉంటుంది. వికసిత్ భారత్ లో నెంబర్ వన్ గా తెలంగాణ, ఏపీ ఉంటాయని ఆశాభావం వ్యక్తి చేశారు. ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని తెలుగు ప్రజలను కోరుతున్నాను. గ్లోబల్ సిటిజన్స్ గా మన తెలుగుజాతి ఉంటుంది. అన్ని వ్యవస్థల్లో తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఎవరికీ ఇవ్వని గౌరవం తెలుగు జాతి నాకు ఇచ్చింది
ఏ నాయకుడికీ ఇవ్వని గౌరవం తెలుగుజాతి నాకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో 9 యేళ్లు సీఎంగా ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతాను. రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి త్వరలో కమిటీ వేస్తాం. రాజకీయాలు ఎలా ఉన్నా జాతి ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలి. తెలుగునేలపై నేను తిరగని ప్రాంతం లేదు. అదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు తెలియని ఊరు లేదు. నా జీవితంలో చివరి రక్తం బొట్టు వరకూ ప్రజలకు ఏం చేయాలో చేస్తూనే ఉంటానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మొన్నటి ఏపీ ఎన్నికల్లో వినూత్నంగా ఆలోచించా. యువతకు అవకాశాలు కల్పించాను. ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం చరిత్రలో ఇంతటి విజయం మునుపెన్నడూ చూడలేదు. వచ్చిన సునామీలో నాటి విధ్వంసకర ప్రభుత్వం కొట్టుకుపోయింది. ప్రజాస్వామ్యంలో రాజులు, నియంతులు లేరు… విర్రవీగితే ఎక్కడికి పంపాలో ప్రజలకు బాగా తెలుసు… ప్రజలకు సేవకులమే తప్ప…పెత్తందారులం కాదని ఇందుమూలంగా చెప్పారు. సీబీఎన్ 1995…2024 కాదు. 1995లో ఏవిధంగా పని చేశానో అదే విధంగా చేస్తా. ఆకస్మిక తనిఖీలతో తెల్లవారు జామున తిరిగి సమస్యలు పరిష్కరించాను. శ్రమదానం, జన్మభూమితో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. సైబరాబాద్ నిర్మించి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ ను తీసుకొచ్చామని గుర్తు చేశారు.

పార్టీకి యువరక్తం ఎక్కిస్తా
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలున్నారు…మళ్లీ యువతను ప్రోత్సహిస్తా. యువ రక్తాన్ని ఎక్కిస్తాం. అధికారంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షానే ఉంటా. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పిల్లలకు చదువు, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలందిస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు వేసే పునాదే మళ్లీ 30 ఏళ్లు పాటు ఉంటుంది. ఏపీలో పవన్ ముందుకు వచ్చి వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చి కలిసి పొత్తు ప్రకటించారు. బీజేపీ కూడా ముందుకు వచ్చి కలిసి పోటీ చేశాం. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలు బాగా పని చేశాయి. తెలంగాణ నుండి ఎన్నికల ముందు 70 రైళ్లలో వచ్చి ఓట్లు వేశారు. చిన్న పనులు చేసుకునే వారు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఏ విధంగా వారి రుణం తీసుకోవాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా వారి అభిమానాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు.

ఏపీని విధ్వంసం చేసిన భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం
ఏపీలో సైకో కాదు…ఒక భూతం ఉంది. పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే మీపై నమ్మకం ఉంది…కానీ మీ రాష్ట్రంలో ఒక బూతం ఉందని అన్నారు. మీ ప్రజలు ఎప్పుడైనా వేరే విధంగా ఆలోచిస్తే ఆ భూతం ముందుకు వస్తుందని అంటున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేసే బాధ్యత తీసుకున్నాం. అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో గత పాలకులు చూపించారు. ఎటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే బాగుంటుందో నిరూపించుకోవాల్సిన సమయం ఉంది. ఈ రోజే అన్నీ అయిపోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది..సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా నాకు ధైర్యం ఉంది. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నాకు అలవాటని సీఎం చంద్రబాబు నాయుడు విశ్వసం వ్యక్తం చేశారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *