Breaking News

దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది

– ఏపీ వక్ఫ్ బోర్డు చరిత్రలో సువర్ణ అధ్యాయం
– ఏపీకి చెందిన వేలాది కీలక వక్ఫ్ రికార్డులు స్వాధీనం.
– ఏపీ కు రావాల్సిన 55 కోట్ల రూపాయల బకాయిలు కూడా త్వరలో విడుదల.
– పట్టుదల, నిరంతర అనుసరణతో సాధించాం
– ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 79 బండిళ్లలోని 3,503 ఫైళ్లు, 4,050 సర్వే కమిషనర్ నివేదికలు, రెండు అధికారిక గెజెట్ సంపుటాలు మరియు ఇతర అత్యంత విలువైన చారిత్రాత్మక రికార్డులను తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు అప్పగించింది. ఈ సందర్భంగా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఇది కేవలం రికార్డుల బదిలీ కాదని, వక్ఫ్ ఆస్తుల హక్కులను పరిరక్షించే కీలక ఆధారాలు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి లభించిన చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రికార్డుల లభ్యత లేకపోవడంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, యాజమాన్య హక్కుల నిర్ధారణ, ఆక్రమణల తొలగింపు, న్యాయపరమైన వ్యవహారాల నిర్వహణ వంటి అనేక కీలక అంశాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడం తన బాధ్యతగా భావించి, చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, నిరంతర అనుసరణతో ఈ లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. తెలంగాణ వక్ఫ్ బోర్డ్ నుంచి ఏపీ కు 55 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని కూడా త్వరలో విడుదల చేయనున్నారని తెలిపారు. ఈ రికార్డుల ద్వారా వక్ఫ్ ఆస్తుల చట్టబద్ధమైన గుర్తింపు, హక్కుల పరిరక్షణ, న్యాయపరమైన కేసుల నిర్వహణ మరియు భవిష్యత్ పరిపాలన మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. దశాబ్దకాలంగా నిలిచిపోయిన సమస్యకు ముగింపు పలికామని, ఈ విజయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఎన్.ఎం.డి. ఫరూక్ అందించిన సహకారం కీలకమని పేర్కొంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, అధికారులు మరియు ఈ ప్రక్రియలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *