-రైతులు, ఉద్యాన రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
-ప్రతి జిల్లాలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను పటిష్ఠంగా అమలు చేయాలి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సంబందిత శాఖల ఉన్నత అధికారులతో ఆయన సమావేశమై వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖలపై ఎల్‌నినో ప్రభావం, ఆయా శాఖలు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, అధిక ప్రమాద మండలాలు, రైతు సేవా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 15 వరకు సాధారణంతో పోలిస్తే 48.3 శాతం వర్షపాతం లోటు నమోదైందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వివరించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 24 జిల్లాలు లోటు వర్షపాతం, నాలుగు జిల్లాలు తీవ్ర లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. అలాగే 8,489 రైతు సేవా కేంద్రాల్లో 1,357 అధిక ప్రమాదం, 2,077 మోస్తరు ప్రమాదం, 5,055 తక్కువ ప్రమాదంగా గుర్తించగా, రాయలసీమ జిల్లాలు అత్యధిక ప్రమాద ప్రాంతాలుగా ఉన్నట్లు వివరించారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించాలని, రైతు సేవా కేంద్రాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతర పంట సలహాలు అందించాలని సీఎస్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించడంతో పాటు, అత్యవసర పరిస్థితులకు అవసరమైన విత్తనాలను ముందుగానే జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS), ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, తక్కువ నీటితో సాగు చేసే పంటలను మరింత విస్తరించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారులు ప్రతిరోజూ పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు.
ఉద్యానవన రంగంపై ప్రత్యేక దృష్టి…
ఎల్‌నినో ప్రభావంతో ముఖ్యంగా మిర్చి, ఉల్లి, కూరగాయలు, మామిడి, నారింజ, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు అధిక ప్రమాదం ఉందని ఉద్యానవన శాఖ కమీషనర్ శ్రీనివాసులు వివరించారు. ముఖ్యంగా రాయలసీమలో నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాల తగ్గుదల వల్ల దిగుబడులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలో డ్రిప్ ఇరిగేషన్‌ను విస్తృతంగా అమలు చేయాలని, ఫార్మ్‌పాండ్లు, మల్చింగ్, షేడ్‌నెట్లు, సూక్ష్మపోషకాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సీఎస్ ఆదేశించారు. ఉద్యానవన పంటలకు అవసరమైన కీలక దశల్లో నీటి పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, పురుగులు, తెగుళ్లపై వారానికోసారి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక మార్గదర్శకత్వం అందించడంతో పాటు భవిష్యత్తులో ఏర్పడే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ఉద్యాన పంటలకు జీవనాధార నీటిపారుదల ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.
పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా ఉండాలి…
వర్షాభావ పరిస్థితుల్లో పశుగ్రాసం, తాగునీటి లభ్యత అత్యంత కీలకమని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. పీఎండీఎస్ ద్వారా పశుగ్రాస ఉత్పత్తిని పెంచాలని, పంట అవశేషాలను పశుగ్రాసంగా వినియోగించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
మేత కొరత ఉన్న ప్రాంతాలకు మిగులు ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని వేగంగా తరలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ప్రతి మండలంలో పశు శిబిరాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పశువుల బలవంతపు అమ్మకాలు జరగకుండా శాండీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
మత్స్యశాఖలో అప్రమత్త చర్యలు…
ఆక్వా, మత్స్యరంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. చెరువుల్లో నీటి మట్టం, నీటి నాణ్యత, కరిగిన ఆక్సిజన్ స్థాయిలను నిరంతరం పరిశీలించాలని, వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
సమన్వయంతో పనిచేస్తే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు…
ఎల్‌నినో పరిస్థితులు మరో కొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి చర్యను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల తదితర శాఖలు సమిష్టిగా పనిచేస్తే రైతులకు కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, రైతులు, ఉద్యాన రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో పిఆర్అండ్ఆర్డి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్టీజిఎస్ సిఇఓ ప్రఖర్ జైన్, వ్యవసాయ శాఖ కమీషనర్ మనజీర్ జిలాని సమూన్, రైతు సాధికార సంస్థ సిఇఒ బి.రామారావు, మత్స్యశాఖ కమీషనర్ రామశంకర్ నాయక్, పశు సంవర్థక శాఖ సంచాలకులు దామోదర నాయుడుతో అన్ని జిల్లాలకు చెందిన సంబందిత శాఖల జిల్లా అధికారులు వర్చ్యువల్ గా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News