– కంపెనీలతో చర్చించి ధరలు పెరిగేలా టోబాకో బోర్డు చర్యలు తీసుకోవాలి
– 2026-27లో ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం
– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వర్జినీయా (FCV) పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టోబాకో బోర్డును కోరారు. శుక్రవారం పొగాకు కొనుగోళ్ల పురోగతిపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టొబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. విశ్వశ్రీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లు, రైతులకు లభిస్తున్న ధరలు, మార్కెట్ పరిస్థితులు, కొనుగోళ్ల వేగవంతంపై విస్తృతంగా సమీక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గత నాలుగు రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా ఊపందుకున్నాయని, ప్రస్తుతం రోజుకు సుమారు 8.5 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్ఠంగా కిలోకు రూ.250 వరకు ధర లభిస్తోందని, రైతులకు మరింత మెరుగైన ధర వచ్చేలా కొనుగోలు సంస్థలతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. ముఖ్యంగా, పొగాకు కొనుగోలు సంస్థలపై సమర్థవంతమైన ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు ఇంకా అధిక ధర లభించేలా చర్యలు చేపట్టాలని టొబాకో బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సూచించారు. కొనుగోళ్లు మరింత వేగవంతం కావడం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే, తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో ప్రత్యేకంగా చర్చలు జరపాలని టొబాకో బోర్డు అధికారులకు మంత్రి ఆదేశించారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని 2026-27 సీజన్‌లో ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేసే దిశగా వ్యవసాయ శాఖ, టోబాకో బోర్డుతో సమన్వయం చేసుకుని రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News