Breaking News

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి
-ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి
-పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి
-హార్టీకల్చర్ హబ్‌కు నిధులు ఇవ్వండి
-మేధో మథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
-కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీలో సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. రొయ్యల మేతకు వినియోగించే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగటం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కారణంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. లక్షలాది మంది రైతులు, కార్మికులు, ప్రాసెసింగ్ కేంద్రాలు, ఎగుమతి దారులు, హేచరీలు, మేత తయారీ దారులు ఇతర అనుబంధ రంగాలకు ఆక్వా పరిశ్రమ ఉపాధి కల్పిస్తోందని సీఎం వివరించారు. మేత లభ్యతలో చిన్న అంతరాయం కూడా ఆక్వా రైతుల మనుగడ, ఎగుమతులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోందని తెలిపారు. రొయ్య మేత తయారీదారుల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో రొయ్య మేత ధరలు భారీగా పెరిగాయని ఫలితంగా ఉత్పత్తి వ్యయం 20 శాతం కంటే ఎక్కువగా పెరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఫిష్ మీల్ టన్ను రూ.1.55 లక్షల నుంచి రూ.2.40 లకు పెరిగిందని, అలాగే చేప నూనె టన్ను రూ.2.80 లక్షల నుంచి రూ.4.40 లక్షలకు, సోయా లెసిథిన్ టన్నుకు రూ.68 వేల నుంచి రూ.1.10 లక్షలకు చేరిందన్నారు. రొయ్యల మేతకు సంబంధించి ఈ ముడిపదార్ధాల భారం టన్నుకు రూ.25 వేల వరకూ పెరిగినట్టు సీఎం కేంద్రమంత్రికి వివరించారు. రొయ్యలు, ఆక్వాకల్చర్ ఉత్పత్తులకు సంబంధించి దేశీయ మార్కెట్ ను ప్రోత్సహించటం, ఎఫ్‌పీఓల ఏర్పాటు, మార్కెట్‌తో ఆక్వా రైతుల అనుసంధానం, దేశీయ మార్కెట్లలో బ్రాండింగ్, ప్రాసెసింగ్, రీటైల్ ధరల ఏకీకరణకు మద్దతు ఇవ్వటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ హెచ్చుతగ్గుల నుంచి ఈ రంగానికి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. దీని కోసం ఓ సంస్థాగత ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రోడ్యూసర్స్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్ఎఫ్ డీబీ ద్వారా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

అమెరికా రెసిప్రోకల్ టారిఫ్ పై సంప్రదింపులు జరపండి

రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గించేలా కేంద్రం సంప్రదింపులు జరపాలని సీఎం అభ్యర్ధించారు. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యలపై 5.77% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీని అమెరికా విధించిందని అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా వేసేందుకు ఆలోచన చేస్తోందని సీఎం తెలిపారు. అమెరికా అధ్యక్షుడి రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం అన్నారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 80 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని, రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తే రాష్ట్రంలోని 30 లక్షల మంది ఆక్వా కల్చర్ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధి దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు. అమెరికాకు చేసే రొయ్య ఎగుమతులను కాపాడేందుకు సీఫుడ్‌పై ప్రస్తుతం ఉన్న 30% కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించాలని లేదా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానిని మినహాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు అంతర్జాతీయంగా వివిధ ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం గుర్తించాలని సీఎం కోరారు.

పొగాకు ఉత్పత్తుల పన్ను భారం తగ్గించండి

వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను శ్లాబులో ఉంచటం పొగాకు రైతులపై నేరుగా ప్రభావం చూపిస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రికి సీఎం వివరించారు. సిగరెట్లపై భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకం పై జీఎస్టీని లెక్కించటం భారమైనట్టు పరిశ్రమ వర్గాలు ఆందోళన చేస్తున్నాయని అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని తయారీ దారులు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో వేలం పాటల్లో పాల్గొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది వేలం ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. తయారీ దారుల కొనుగోళ్లు తగ్గించటంతో రైతు కూలీలు, వేలం కేంద్రాల కార్మికులు, రవాణాదారులు, ఎంఎస్‌ఎంఈ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఈ ఏడాది 230 మిలియన్ కేజీల ఉత్పత్తికిగానూ కేవలం 34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయన్నారు. చట్టబద్ధమైన సిగరెట్లు అక్రమ పొగాకు ఉత్పత్తుల మధ్య ధరల వ్యత్యాసం పెరగడం వల్ల, అక్రమ రవాణా పన్ను ఎగవేత కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. తక్షణం పొగాకు రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

హార్టీకల్చర్ హబ్‌కు సహకారం

రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం స్పష్టం చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి సహా ప్రకాశం, మార్కాపురం జిల్లాలు ఉద్యాన ఉత్పత్తిలో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయని సీఎం వివరించారు. 2030 నాటికి సాగు విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచటంతో పాటు ఉద్యాన ఉత్పత్తులను 435 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
201 ఉద్యానవన క్లస్టర్ల ద్వారా రూ. 14,906 కోట్ల పెట్టుబడి ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నీటి భద్రత కోసం రూ.20,884 కోట్ల వ్యయంతో 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని. తద్వారా 9 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. రూ. 4,562 కోట్ల వ్యయంతో 5,721 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టి వివిధ ప్రాంతాలను అనుసంధానించాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ ద్వారా రైతులకు మార్కెట్ సౌకర్యంతో పాటు రవాణా ఖర్చులు తగ్గుతాయని అన్నారు. ప్రభుత్వం నుంచి రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం ద్వారా రూ.60 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ పెట్టుబడితో ఏటా రూ.81 వేల కోట్ల జీవీఏ సాధించే అవకాశం ఉంటుందని .. 19.7 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. వ్యవసాయంలో ఆధునిక పరికరాల ద్వారా దిగుబడిలో 10 శాతం వృద్ధి సాధించటంతో పాటు కోత అనంతర నష్టాలను 45 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ , స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవాలన్నదే ఈ ప్రణాళిక లక్ష్యమని సీఎం వివరించారు. ఆగస్టు 6-7 తేదీల్లో హార్టీకల్చర్ హబ్ పనులు ప్రారంభించనున్నామని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేంద్ర మంత్రిని ఆహ్వానించారు.

ఆవిష్కరణల కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ప్రతిపాదించామని సీఎం కేంద్ర ఆర్ధిక మంత్రికి వివరించారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఐఎస్ఏ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఆవిష్కరణల్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఇది పనిచేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఏఐ, డిజిటల్ అగ్రికల్చర్, వాతావరణ సుస్థిరత లాంటి అంశాలపై దృష్టి్ సారించేలా ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఫార్మింగ్, పోస్ట్-హార్వెస్ట్ సిస్టమ్స్, గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేలా ఐఎస్ఐ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, అగ్రిటెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుందని సీఎం తెలిపారు. రిలయన్స్ గ్రూప్ యాంకర్ భాగస్వామిగా స్టార్టప్, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. జాన్ డీర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా, నెస్లే, కార్గిల్ లాంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి పరిశోధనా సహకారాన్ని కూడా తీసుకోనున్నట్టు సీఎం తెలిపారు. ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్, డిజిటల్ అగ్రికల్చర్ లో మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ లాంటి ప్రపంచ స్థాయి కోర్సులను అందించేలా దీనిని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆగస్టు 3 తేదీన రిలయన్స్ గ్రూప్ తో ఐఎస్ఏ ఏర్పాటుపై ఎంఓయూ కుదుర్చుకోనున్నామని.. సంస్థ ఏర్పాటుకు అవసరైన భూమిని కూడా గుర్తించినట్టు సీఎం తెలిపారు. విద్యా బోధనతో పాటు ఏపీ అగ్రికల్చరల్ ట్రాన్సఫర్మేషన్ కు ఓ మేధోమథన కేంద్రంగా ఆవిష్కరణలకు ఇంజిన్ గా ఐఎస్ఏ పనిచేస్తుందని సీఎం తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటులో తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పదిేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-ఎ భూ సమస్యకు పరిష్కారం

-పీజీఆర్ఎస్ ద్వారా వేములూరు గ్రామస్తులకు ఊరట -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *