-రైతుల పాసుపుస్తకాలపై జగన్ ఫోటో పెట్టుకోవడం ప్రచార పిచ్చికి పరాకాష్ట
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు.
దేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మను ముద్రించుకున్నారని తెలిపారు. ఇది జగన్ రెడ్డి ప్రచార పిచ్చికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.15 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. పొలాల సరిహద్దు రాళ్లపై కూడా తన బొమ్మను ముద్రించి జగన్ మోహన్ రెడ్డి రూ.700 కోట్ల ప్రజాధనం వృధా చేశారని.. ఈ సొమ్మును సరిగ్గా వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలోని ఏదో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేదని వివరించారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూస్తే ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.