Breaking News

ఇద్దరు అసాధ్యులు.. ఓ అద్భుత విజయం

– మోకాలి లిగమెంట్ తెగిపోవడంతో క్రికెటర్ కు శస్త్రచికిత్స
– చికిత్స అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
– డెఫ్ అండ్ డంబ్ క్రికెటర్ యశ్వంత్ నాయుడు, ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ ఉప్పలపాటి భార్గవ్ రామ్ లపై ప్రశంసల జల్లు
– ఇరువురిని ఘనంగా సత్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితర ప్రముఖులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విధిని సైతం ఎదిరించే ఓ యువకుడి పట్టుదల, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల వైద్య నిపుణుడి ప్రతిభ.. కలగలిసి ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక అంతా అయిపోయిందనుకున్న సమయంలో.. ఆ ఇరువురి కృషితో లభించిన అసాధారణమైన విజయం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

మూగ-చెవిటి క్రికెట్ టీమ్ సభ్యుడైన యశ్వంత్ నాయుడు గతేడాది జరిగిన ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. ప్రమాదంలో యశ్వంత్ మోకాలి ఏసీఎల్ లిగమెంట్ తెగిపోయింది. ఏసీఎల్ లిగమెంట్ తెగిపోయిన వ్యక్తుల మోకాలు వదులుగా మారిపోతుంది. అందువల్ల వారు క్రికెట్ తదితర ఆటల్లో పాల్గొనలేరు. ఇక క్రికెట్ ఆడటం అసాధ్యమనుకున్న తరుణంలో ట్రస్ట్ జాయింట్ సెంటర్ అధినేత, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉప్పలపాటి భార్గవ్ రామ్.. యశ్వంత్ నాయుడు పరిస్థితిని సమీక్షించి అత్యాధునాతన చికిత్సకు అన్నీ సిద్ధం చేశారు. యశ్వంత్ నాయుడు మోకాలికి ఆర్థోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత స్వల్ప స్థాయిలో మాత్రమే ఎముకను కత్తిరిస్తూ, ఎటువంటి స్క్రూలు వాడకుండా ఇంటర్నల్ బ్రేస్ తో ఆల్ ఇన్ సైడ్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీని పూర్తి చేశారు. చికిత్స అనంతరం త్వరత్వరగా కోలుకున్న యశ్వంత్ నాయుడు.. నాలుగు నెలల్లోనే క్రికెట్ ప్రాక్టీస్ తిరిగి ప్రారంభించాడు. స్వతహాగా ఫాస్ట్ బౌలర్ అయిన యశ్వంత్.. ఇటీవల జమ్మూలో జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడమే కాకుండా, ఆ ఆటలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు.

గాయం నుంచి కోలుకుని.. ఇటువంటి స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడిన యశ్వంత్ నాయుడు, అద్భుత చికిత్సతో యువ ఆటగాడిని తిరిగి సత్తా చాటేలా చేసిన డాక్టర్ భార్గవ్ రామ్ లను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితరులు యశ్వంత్ నాయుడు, డాక్టర్ భార్గవ్ రామ్ లను సత్కరించారు.

నగరంలోని ట్రస్ట్ జాయింట్ సెంటర్ నందు గురువారం జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకుని అసమాన ప్రతిభ కనబరిచిన యశ్వంత్ నాయుడు, యువ ఆటగాడిని పునరుత్తేజితుడిని గావించిన డాక్టర్ ఉప్పలపాటి భార్గవ్ రామ్ లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. కోలుకోలేని గాయం నుంచి తేరుకోవడమే కాక, అత్యుత్తమ ప్రదర్శనతో యశ్వంత్ నాయుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం చారిత్రాత్మమకమని కొనియాడారు. అద్భుత చికిత్సతో యశ్వంత్ నాయుడును అంతర్జాతీయ స్థాయిలో తిరిగి ఆడేలా చేసిన డాక్టర్ భార్గవ్ రామ్ ను ఎమ్మెల్యే గద్దె ఈ సందర్భంగా అభినందించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *