-స్కాచ్ అవార్డు కేటగిరిలో సెమీఫైనల్ కి ఎంపికైన బంగారుకొండ కార్యక్రమం
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో నూతన ఆవిష్కరణ లో భాగంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన బంగారు కొండ కార్యక్రమానికి ప్రతిష్టాత్మక మైన స్కాచ్ అవార్డు ఎంపికలో భాగంగా సెమీ ఫైనల్స్ కి ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, గతంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన డా కె. మాధవీలత వారి ఆలోచనలతో బంగారు కొండ కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందన్నారు. రక్తహీనత, వయస్సుకు తగ్గ ఎదుగుదల లేని, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని గుర్తించి వారిని సాధారణ స్ధితికి తీసుకుని రావడం లో ప్రజలను భాగస్వామ్యం చెయ్యడంలో వారి సామాజిక బాధ్యత పట్ల ఆసక్తి పెంచడానికి ఒక చక్కటి కార్యక్రమం గా బంగారు కొండ కార్యక్రమానికి మాధవీలత శ్రీకారం చుట్టారన్నారు. వాటిని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనం ఉండేలా అప్పటి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ సాంకేతిక పరిజ్ఞానం ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. నేడు మరింత ఫలవంతంగా చేపట్టే క్రమంలో బంగరుకొండ ప్లస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులను, కార్పొరేట్ సంస్థలని, ప్రజా ప్రతినిధులను, స్వచ్ఛంధ సంస్థలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బంగారు కొండ ప్లస్ కింద పిల్లల ఆరోగ్య స్థితి గతుల, వైద్యులు ఆధారంగా పోషక విలువలతో కూడిన తోడ్పాటు దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిపారు. స్ర్తీ శిశు సంక్షేమ అధికారులు స్కాచ్ ప్రశంస పత్రం కింద బంగారు కొండ కార్యక్రమానికి 4500 పైగా ఓట్లు దక్కించుకుని సెమీఫైనల్లో స్థానం దక్కించుకున్నట్లు తెలియ చేశారు.
ఈ సందర్బంగా పూర్వపు కలెక్టరు డాక్టరు కె. మాధవీలత స్పందిస్తూ, స్కాచ్ ప్రశంస పత్రం టీం తూర్పు గోదావరి జిల్లా సాధించిన విజయంగా, ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. బంగారు కొండ కార్యక్రమంలో చిన్నారులను ఆరోగ్య సంరక్షణ కోసం దత్తత తీసుకుని వారి గృహాలను సందర్శించి వారితో మమేకమై ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం భాగస్వామ్యం ఒక చక్కటి అనుభూతిని కలుగ చేసినట్లు పేర్కొన్నారు.