-నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు
-వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
-వారం రోజుల్లో బురద రహిత విజయవాడ
-ఇళ్లు, రోడ్లు క్లీనింగ్ కాగానే మరమ్మత్తుల కార్యక్రమం
-వరద తాకిడికి పాడైపోయిన టివి, ప్రిడ్జ్, గ్యాస్ పోయ్యిలు
-వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు
-బట్టలు, దుస్తుల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకి అన్నిరకాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నాడు. వరద ముంపులో మునిగిపోయిన ప్రతి ఇంటికి ఆర్థిక సాయం ప్రకటించటంతోపాటు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు కూడా ఆర్థిక సాయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఇప్పటికే బ్యాంకర్స్ తో మాట్లాడినట్లు తెలిపారు.
రాష్ట్ర పౌరసరఫరా శాఖ ఆధ్వర్యంలో వరద భాదితుల సహాయర్ధం పంపిణీ చేసే బియ్యం, నిత్యావసర సరుకులు తరలించే వాహనాలను బి.ఆర్.టి.యస్ రోడ్ ఘంటసాల సంగీత కళాశాల జంక్షన్ వద్ద శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు, కందుల దుర్గేష్, ఎంపి కేశినేని చిన్ని ప్రారంభించారు. అనంతరం ఆ వాహనాలు నగరంలోని పలు డివిజన్స్ లో బాధితులకి పంపిణీ చేసేందుకు బయలుదేరాయి.
ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ బాధితులకి నెల రోజులకి సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నిత్యావసర సరుకుల్లో 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటరు పామాయిల్ వున్నయన్నారు. 1200 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ జరిగే విధంగా ఏర్పాట్లు జరిగాయన్నారు. బాధితులకి బట్టలు, దుప్పట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. వినాయక చవితి సందర్బంగా సహాయక చర్యలకు ఎలాంటి ఇబ్బంది వుండదన్నారు. అధికారులు అందరూ అందుబాటులో వుంటారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు గత ఆరు రోజులుగా అధికారులందరూ 20గంటలు పని చేస్తున్నారని అందుకే బాధితులందరికీ సహాయక చర్యలు త్వరగా అందుతున్నాయన్నారు.
వరద తగ్గిన ప్రాంతాల్లో రోడ్లు, ఇండ్లలోని బురద తొలగించేందుకు 300 ఫైరింజన్స్ ఉపయోగించి శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని కార్పెంటర్స్, బైక్ మెకానిక్స్, టివి రిపెర్స్, గ్యాస్ స్టౌ మెకానిక్స్ ను ఇక్కడికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడన్నారు. బురద క్లీనింగ్ పూర్తి అయిన తర్వాత మర్మమత్తుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుందన్నారు. వరద కారణంగా నీట మునిగిన ఆటోలు, కారులు, బైక్స్ కి ఇన్య్సూరెన్స్ క్లైయిమ్ పదిరోజుల్లో క్లియర్ చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. వరద కారణంగా నష్టపోయిన వ్యాపారస్తులు తిరిగి నిలదొక్కునేందుకు బ్యాంకర్స్ తో మాట్లాడి రుణాలు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు గత ఆరు రోజులుగా విజయవాడలోనే వుంటూ బాధితుల్ని అండగా వుంటూ, వరద కారణంగా నష్టపోయిన ప్రజలు తిరిగి నిలదొక్కుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.