– ఒకేచోట అందుబాటులో 13 బ్యాంకుల కౌంటర్లు
– అక్కడికక్కడే రీషెడ్యూల్‌తో పాటు కొత్త రుణాల దరఖాస్తుల పరిష్కారం.
– ఫెసిలిటేషన్ కేంద్రం సేవలను ముంపు బాధితులు సద్వినియోగం చేసుకోవాలి
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని.. బాధితులు ఈ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు.
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన బ్యాంకింగ్ సేవల ఫెసిలిటేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్‌తో కలిసి కలెక్టర్ డా. జి.సృజన సందర్శించారు.
ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా ముంపు ప్రభావిత ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను మెరుగ్గా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సేవలు అందించేందుకు వీలుగా వివిధ దరఖాస్తులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.సృజన మాట్లాడుతూ
బీమా సేవలకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం విజయవంతమైన నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకూ ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు, అక్కడికక్కడే దరఖాస్తుల పరిష్కారంతో పాటు సమర్థవంతమైన ఫాలో-అప్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో మొత్తం 13 బ్యాంకులు యూబీఐ, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల ప్రతినిధులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. రుణాల రీషెడ్యూల్ అవకాశాన్ని పొందడంతో పాటు వినియోగ రుణాలు, కొత్త మూలధన రుణాలు వంటి సేవలు పొందొచ్చని తెలిపారు. చాలా తేలిగ్గా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ సృజన తెలిపారు.
కార్యక్రమంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్‌బీసీ) ఏజీఎం డి.శ్రీనివాస్, యూబీఐ డిప్యూటీ రీజనల్ హెడ్ ఐఎస్ఎస్ మూర్తి, ఎల్‌డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.