-ప్రింటింగ్ ప్రెస్ కు జీఎస్టీ ఉంటే చాలు
-వెటరన్ అక్రిడేషన్స్ పెంచుతాం
-హెల్త్ కార్డులు, భీమా పథకం అమలులోకి తెస్తాం
-ఇంటి స్థలాల కేటాయింపు కు చర్యలు
-రూ 5 లక్షల అంశం తన పరిధిలో లేదు
-ఏ.పి.యు.డబ్ల్యు.జే. కి కమిషనర్ హామీ
-ఆర్థిక సాయం కోసం ఉద్యమం… ఐ. వి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పనిచేసే జర్నలిస్టులు అందరికీ తప్పనిసరిగా అక్రెడిటేషన్ ఇస్తామని, ఈ విషయంలో అందరికీ న్యాయం చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం తనను కలిసిన ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర నాయకత్వ బృందానికి కమిషనర్ ఆమేరకు హామీఇచ్చారు.
ఐ.జే.యు.జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏ.పి.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, పూర్వాధ్యక్షుడు డి.సోమసుందర్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, కృష్ణా అర్బన్ జిల్లా కార్యదర్శి కొండా రాజేశ్వరరావు బుధవారం కమిషనర్ ను కలిసి రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలని తక్షణం పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలు సమస్యలపై సవివరమైన చర్చ జరిగింది. ఈ భేటీలో అదనపు సంచాలకులు స్వర్ణలత, ఉప సంచాలకులు కస్తూరి పాల్గొన్నారు.
యూనియన్ ప్రతినిధి బృందం లేవనెత్తిన సమస్యలపై కమిషనర్ విజయకుమార్ రెడ్డి అంశాలవారీ స్పందించారు. అక్రెడిటేషన్ జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, దరఖాస్తుల స్వీకరణకు, సవరణలకు తుదిగడువు ఏమీ లేదన్నారు. వెబ్ సైట్ ఓపెన్ లోనే ఉంచుతామని, ఇంకా ఎవరైనా మిగిలిఉంటే వారుకూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చుననీ కమిషనర్ యూనియన్ నేతలకు తెలిపారు. పత్రికలకు జీఎస్టీ లేకున్నా ప్రింటింగ్ ప్రెస్ కు జీఎస్టీ ఉంటే దాన్నిపరిగణలోనికి తీసుకుంటామన్నారు. మండలకేంద్రాల్లో విలేఖరిగా పనిచేస్తూ వార్తల క్లిప్పింగులు పెట్టిన అందరికీ సర్క్యులేషన్ నియమాన్ని సడలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఏ పత్రికలోనూ పనిచేయకున్నా, ఇరవై సంవత్సరాలకు మించి సర్వీస్ ఉన్న సీనియర్ పాత్రికేయులకు వెటరన్ గా అక్రెడిటేషన్ ఇస్తామన్నారు. అక్రెడిటేషన్లు జారీ అయిన వెంటనే హెల్త్ కార్డులు, ప్రమాద బీమా పథకాల అమలు ప్రారంభిస్తామని కమిషనర్ తెలిపారు.
కరోనాతో కన్నుమూసిన పాత్రికేయుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థికసహాయం అందచేసే విషయంలో జాప్యం జరగడం పై యూనియన్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిపై కమిషనర్ మాట్లాడుతూ ఆర్థికసాయం విషయం తనపరిధిలో లేదని దానిపై ప్రభుత్వపెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని ఆయన హామీ ఇచ్చారు. అక్రెడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల ప్రాతినిధ్యం ఉండరాదని హైకోర్టు తీర్పులో ఎక్కడా చెప్పలేదని, ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, జర్నలిస్టులకు ఆయా కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు గతం నుండీ ఉన్న ప్రాతినిధ్య హక్కును తీసేసిన హైకోర్టు తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం తగువిధంగా స్పందించని పక్షంలో తమ యూనియన్ వివిధ రూపాల్లో పోరాడుతుందని స్పష్టం చేశారు.