-తొలి దశలో 1393 రోడ్లకు 7071 కి.మీ మేర మరమ్మతులు
-వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ. 186 కోట్లు విడుదల
-రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి
-రహదారుల నిర్వహణపై SRM వర్సిటీలో ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన 7071 కి.మీ రహదారులకు సంబంధించిన 1393 రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చేందుకు రూ.290 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు. “ రాష్ట్ర రహదారుల నిర్వహణ, పునరావాసం- సవాళ్లు మరియు ఉత్తమ పద్ధతులు’ అన్న అంశంపై నేడు AP – SRM యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. రోడ్లు భవనాల శాఖ, ఏపీ ఎస్ఆర్ఎం, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లు సంయుక్తంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించాయి.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తన వీడియో సందేశాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులను గుంతలు రహిత రోడ్లుగా మార్చేందుకు సరికొత్త టెక్నాలజీతో ముందుకు సాగుతున్నామని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఏపీ SRM వర్సిటీ సివిల్ ఇంజినీర్లు టెక్నాలజీ పరంగా సంపూర్ణ సహకారం అందించేందుకు ముందుకు రావడం, ఎంవోయూ కుదుర్చుకోవడం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్దరణకు రూ. 186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేయడం జరిగిందని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడుతూ, గడచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలో రోడ్లు అధ్వాన స్థితికి చేరాయని, వీటి నిర్వహణ, పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడం జరిగిందన్నారు. సరికొత్త టెక్నాలజీతో రోడ్లును బాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రానున్న కాలంలో ఏడాదికి 9 వేల కిలోమీటర్ల మేరకు రోడ్లు బాగు చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనలో శాస్త్రీయ పరమైన పరిశోధనకు సహకారం అందిస్తోన్న SRM వర్సిటీ సివిల్ ఇంజినీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన CSIR – సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోరంజన్ పారిడా రోడ్ల నాణ్యతలకు సంబంధించిన పరిశోధనల గురించి వివరించారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోరా, ఆర్ & బీ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నయిముల్లా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రోడ్ల సమగ్ర అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన పలు నిర్ణయాలను ఈ వర్క్ షాప్ లో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ హైవేస్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, వర్క్ షాప్ కన్వీనర్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, బిల్డర్స్ అసోసియేషన్ ఏపీ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు, SRM వర్సిటీ సివిల్ ఇంజినీర్లు డాక్టర్ రవితేజ, డాక్టర్ ప్రణవ్, డాక్టర్ భరత్ పాటు ఆర్ & బీ ఇంజినీర్లు పలువురు పాల్గొన్నారు.