-నారీశక్తి విజయోత్సవ సభలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-అధ్యాత్మికత స్ఫురించేలా, మహిళా సాధికారత చాటేలా తీర్చిదిద్దిన కార్యక్రమ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్
-మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించిన మంత్రి దుర్గేష్
-మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణన
-నారీశక్తి విజయోత్సవం కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడి
-గత ఐదేళ్లలో మహిళా హక్కులు హరించబడ్డాయని, బాలికలు అక్రమ రవాణాకు గురయ్యారని, మహిళాశక్తి సన్నగిల్లిపోయిందని విమర్శించిన మంత్రి దుర్గేష్
-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేసిన మంత్రి
-మహిళామూర్తులకు పురుషులందరూ దన్నుగా నిలవాలని మంత్రి దుర్గేష్ సూచన
-నారీశక్తి విజయోత్సవం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియగా, కార్యక్రమం ఏరకంగా ఉండాలని స్వరూప స్వభావాలను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి దుర్గేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నారీశక్తి విజయోత్సవం మహిళా లోకానికి గెలుపు లాంటిదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని పున్నమి ఘాటు వద్ద బబ్బూరి గ్రౌండ్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా అట్టహాసంగా నిర్వహించిన నారీశక్తి విజయోత్సవం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నారీశక్తి విజయోత్సవం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి..కార్యక్రమం ఏ రకంగా ఉండాలో స్వరూప స్వభావాలను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. నారీశక్తి విజయోత్సవం’లో భాగంగా కృష్ణా నది ఒడ్డున నవ దుర్గల స్వరూపాలు ప్రతిబింబించేలా ఆకట్టుకున్న ప్రదర్శనను మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తిగా తిలకించారు. అంతకుముందు మంత్రి దుర్గేష్ కు టూరిజం ఎండి అభిషిక్త్ కిషోర్ స్వాగతం పలికారు.కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఆధ్యాత్మికత స్ఫురించేలా మహిళా సాధికారత చాటేలా నిర్వహించిన కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించారు. మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణించారు.స్వాతంత్రోద్యమ సమయంలో మొట్టమొదటగా కత్తిపట్టిన వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి దగ్గర్నుంచి నేటి చెడు మీద పోరాటం చేస్తున్న ప్రస్తుత ప్రజా ప్రతినిధుల వరకు మహిళామణులు విస్తృతంగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అన్న సినీ కవుల గేయాల పరమార్థాన్ని గుర్తించి మహిళామూర్తులకు పురుషులందరూ దన్నుగా నిలవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. గత ఐదేళ్లలో మహిళా హక్కులు హరించబడ్డాయని, బాలికలు అక్రమ రవాణాకు గురయ్యారని, మహిళాశక్తి సన్నగిల్లిపోయిందని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేసారు.బేటీ బచావో బేటీ పడావో అన్నమాటను తూచా తప్పక పాటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా దుర్గమ్మ భక్తులేనని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
నారీశక్తి విజయోత్సవం కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అద్భుతంగా నారి శక్తి విజయోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులకు,సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులకు, సహచర మహిళా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు,రాజకీయ నాయకులకు, సిబ్బందికి, ఆద్యంతం కార్యక్రమం వీక్షించిన ప్రజలకు మంత్రి కందుల ధన్యవాదాలు తెలిపారు.
,అంతిమంగా చెడు పై ఎప్పుడూ మంచి అనేదే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పరమార్థాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుందామని, నారీ శక్తికి దసరా వేడుకలు నిదర్శనం అన్నారు. ఈ దసరా ప్రజల జీవితంలోని చీకటిని, బాధను దహించి మీకు ఆనందం, శ్రేయస్సును తెస్తుందని ఆశిస్తున్నాను. విజయానందాలతో ప్రజల జీవితం దేదీప్యమానంగా వెలుగొందాలని, భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా సాగాలని మంత్రి కోరారు. ప్రజలంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. విజయదశమి సందర్భంగా అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని మంత్రి కాంక్షించారు.