-గత రెండు నెలల్లో ఏమేరకు మార్పు తెచ్చారని ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
-శుభ్రత, సైనేజ్ బోర్డులు, ఓపీ రిజిస్ట్రేషన్ , రిసెప్షన్, ఫీడ్ బ్యాక్ , హాజరు నియంత్రణ, కేంద్రీకృత నమూనాల సేకరణ వంటి పలు అంశాల్లో మార్పులు తెచ్చామన్న జీజీహెచ్ల సూపరింటెండెంట్లు
-మార్పును ప్రజలు గమనించారా? మీడియా గుర్తించిందా ? అని అడిగిన మంత్రి
-సూపరింటెండెంట్లు, వైద్య సిబ్బంది కృషిని ప్రశంసిస్తూనే… చేయాల్సింది చాలా ఉందన్న మంత్రి
-పట్టుదల, కృషితో జీజీహెచ్ల నిర్వహణ, సేవల్ని మెరుగుపర్చాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
-రోగులకు సేవలందించేందుకు 725 మంది సహాయకులు, రూ.240 కోట్ల మేరకు పరికరాల అవసరాల గుర్తింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సర్వజనాసుపత్రుల నిర్వహణ, సేవల్ని మెరుగుపర్చి వీటి పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించేందుకు రెండు నెలల క్రితం రూపొందించిన 30 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గురువారంనాడు వెలగపూడి సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. మూడు గంటల పాటు సాగిన సమీక్షలో అంశాల వారీగా జీజీహెచ్లలో చేపట్టబడిన చర్యలపై వివరాల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. పలు చర్యలు చేపట్టామని సూపరింటెండెంట్లు వివరించగా…. తద్వారా ఆసుపత్రుల నిర్వహణ, సేవల నాణ్యతలో వచ్చిన మార్పుల్ని ప్రజలు గమనించినప్పుడే సార్ధకత ఉంటుందని, ఈ దిశగా ప్రసార మాధ్యమాల్లో వార్తల్ని చూడలేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఆసుపత్రుల అధికారులు తమ ప్రయత్నాల్ని, వాటి ఫలితాల్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలపాలని ఆయన సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి.కృష్ణబాబు, డిఎంఇ డాక్టర్ నరసింహం , 16 ప్రభుత్వ సర్వజనాసుపత్రులు, విశాఖపట్నంలోని ఛాతి వ్యాధుల ఆసుపత్రి సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు పాల్టొన్నారు.
సూపరింటెండెంట్లు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, ప్రభుత్వ వైద్య సేవల పట్ల ప్రజల్లో మరింత సానుకూల అభిప్రాయాన్ని కల్పించేందుకు ఇంకా శ్రమించి, గమనించదగ్గ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాసుపత్రులు కొన్ని పరిమితులకు లోబడి పనిచేస్తున్నా నాణ్యమైన సేవల్ని ఆశించే హక్కు ప్రజలకు ఉందని, వారి అంచనాల మేరకు పనిచేయడం ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. తమ బాధ్యతల్ని గుర్తించి పట్టుదలతో కృషి చేస్తే సత్ఫలితాల్ని సాధించవచ్చని ఆయన అన్నారు. జీజీహెచ్లలో జరుగుతున్న కృషి, వాటి ఫలితాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాల్ని మదింపు చేసేందుకు తగు చర్యల్ని చేపడతామని ఆయన అన్నారు.
30 అంశాల కార్యాచరణ ప్రణాళికలో మొదటి కొద్ది నెలల్లో చేపట్టాల్సిన కొన్ని చర్యలపై 17 ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తెలిపిన ప్రగతి వివరాలు
1) సాయంకాలం ఓపీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులు-17
2) రోగులు, సహాయకుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న ఆసుపత్రులు-17
3) ఫిర్యాదులు, సలహాల పెట్టెలను ఏర్పాటు చేసిన ఆసుపత్రులు -17
4) ఆసుపత్రులు అందిస్తున్న సేవల వివరాల్ని తరచుగా ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్న ఆసుపత్రులు-15
5) స్పెషలిస్టులు, సీనియర్ డాక్టర్ల ద్వారా మధ్యాహ్నం ఓపీ సేవల్ని అందిస్తున్న ఆసుపత్రులు-15
6) రోగులు, సహాయకులు ప్రయోజనాలతో సైనేజ్ బోర్డుల్ని ఏర్పాటు చేసిన ఆసుపత్రులు-14
7) ఓపీ సేవలకు సమీపంలో రక్త నమూనాల సేకరణ జరుపుతున్న ఆసుపత్రులు -14
8) వైద్యులు, ఇతర సిబ్బంది హాజరును పటిష్టంగా పర్యవేక్షిస్తున్న ఆసుపత్రులు -14
9) ఆసుపత్రులు, ప్రాంగణాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించిన ఆసుపత్రులు-13
10) రోగులకు కేవలం అర గంట సమయంలో ఓపీ రిజిస్ట్రేషన్ కల్పిస్తున్న ఆసుపత్రులు-12
మధ్య, దీర్ఘ కాలిక వ్యవధిలో పూర్తి చేయాల్సిన, వివిధ ఆసుపత్రులు చేపట్టిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. నిర్దేశించిన విధంగా వివిధ కాలపరిమితుల్లో రెండు నెలల క్రితం రూపొందించిన 30 అంశాల కార్యాచరణ ప్రణాళికను నిబద్ధతతో అమలు చేసి ప్రజోపయోగం కోసం సత్ఫలితాల్ని సాధించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడానికి రూ.240 కోట్ల విలువైన వివిధ డయాగ్నోస్టిక్ పరికరాల అవసరం ఉందని, రోగులకు సేవలందించేందుకు 725 మంది సహాయకులు, 300 మంది స్టాఫ్ నర్సుల అవసరం ఉందని వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మంత్రికి వివరించారు. అదే విధంగా వివిధ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ముఖ్యంగా రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్ల కొరత ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ అవసరాలతో పాటు గతంలో అందిన సమాచారం మేరకు పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ల కొరతను కూడా తీర్చడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ తమ శాఖ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.