Breaking News

ప్రభుత్వ ఖాజీల సమస్యలను పరిష్కరిస్తాం

-మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
-రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
-ప్రభుత్వ ఖాజీల తో మంత్రి ఫరూక్ సమావేశం

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాజీల సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. గురువారం అమరావతిలోని మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ పేషీలో మంత్రి ఫరూక్ తో రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. తాము ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, వర్క్ బోర్డ్ సీఈవో అబ్దుల్ ఖదీర్ కు ఖాజీల సంఘం తరఫున సవివరంగా వివరించారు. ఖాజీల సంఘం ప్రతినిధులు మంత్రి ఫరూక్ దృష్టికి పలు సమస్యలను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు.

గత ప్రభుత్వ తీరు గర్హనీయం
రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాజీలుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామని,పదే పదే సమస్యలను గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ అప్పటి ప్రభుత్వం పరిష్కరించలేదని మంత్రి ఫరూక్ కు వివరించారు.తమ సమస్యలన్నీ చాలా న్యాయమైనవని,పరిష్కరించడానికి సహేతుకమైనవని వీలైనంత త్వరగా పరిష్కరించి మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న సంకేతాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. సియం నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంపై ముస్లిం సమాజంలోని మెజారిటీ వారికి అపారమైన విశ్వాసం, ఉందని, ముస్లిం సమాజం సురక్షితంగా ఉంటుందని తాము అందరం బలంగా విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. సుపరిపాలన కోసం ఎలాంటి సంకోచం లేకుండా తామంతా సమిష్టిగా ఓటేశామని, ముస్లిం సమాజ అభివృద్ధి కొరకు, రాష్ట్ర సంక్షేమం కోసం నారా చంద్ర బాబు నాయుడును ముఖ్యమంత్రిగా చూడడానికి తాము (ప్రభుత్వ కాజీలు) కష్టపడి పని చేసామని,ముస్లిం సమాజ ప్రజలను ప్రేరేపించి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేశామని పేర్కొన్నారు.

మంత్రి దృష్టికి ప్రభుత్వ ఖాజీల సమస్యలు
దుల్హన్ పథకం కింద ప్రయోజనం పొందేందుకు గత ప్రభుత్వం విధించిన అసమంజస నిబంధనను మార్చాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఖాజీల నియామకంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఖాజీ ల సంఘం నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఖాజీల చట్టం, 1880 ప్రకారం ప్రభుత్వం ఖాజిలను నియమిస్తుందని, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టమని, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ ఖాజీని మాత్రమే నియమించడం ఇప్పటివరకు జరుగుతున్నదని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఒకే ప్రాంతానికి ఒకరి కంటే ఎక్కువ మంది ఖాజీలను నియమించి ముస్లిం సమాజంలో విభజనలను, సమస్యలను సృష్టించిందని ఆరోపించారు. గత ప్రభుత్వ చట్ట వ్యతిరేక చర్యలతో ఖాజీల పవిత్రత, విధులను పాడు చేసే ఎన్నో అవాంతరాలు తలెత్తాయని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అసెంబ్లీకి ఒక ఖాజీని మాత్రమే నియమించాలని మంత్రి ఫరూక్ కు విన్నవించారు

ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఖాజీ ఉన్నచోట మరొక ఖాజీని నియమించ కూడదని లేదా అదనపు ఖాజీని నియమించకూడదని కోరారు. గతంలో 3 మరియు 10 సంవత్సరాల కాల పరిమితితో ఖాజీల నియామకం జరిగిందని, కాల పరిమితి రద్దుచేసి వారి పోస్టులను క్రమబద్ధీకరించాలని కోరారు.

ముస్లిం సమాజ ప్రయోజనాల కోసం వివాహ ధ్రువీకరణ పత్రాలు ( నిఖానామా), విడాకుల ధ్రువీకరణ పత్రాలు(ఖులా ) అన్ని ప్రభుత్వ అధికారుల చేత ఆమోదించబడతాయని, నిఖా చేయడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుందని ఆ సమయం దాటితే ఆరోజు వివాహం జరగదని కూడా పేర్కొనాలని కోరారు. వధువు కుటుంబం నుండి వరకట్నాన్ని తీసుకోలేదని పేర్కొంటూ వరుడు అతని తరుపు కుటుంబం నుంచి ఒక డిక్లరేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ఉన్న ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూ భాషను ద్వితీయ భాషగా పరిగణించడం ఎంతో అవసరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రభుత్వ ఖాజీల కోసం ఒక ప్రత్యేకమైన యాప్ ను క్రియేట్ చేయడం ద్వారా ఖాజీలు అందరిని ఒకచోట పొందుపరచడం, వివాహ బుక్ లెట్లు ఇతర పూర్తి వివరాలను తయారుచేసి ఒక పద్ధతిని అనుసరించడం ద్వారా రాష్ట్రమంతటా ఒకే విధానం, ఏక రీతి చార్జీలు అమలయేటట్టుగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ విధానంలో సంబంధిత ఖాజీ సూచన, ప్రామాణికత తప్పనిసరి చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుండి వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు.

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఖాజీలకు ఇస్తున్న తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరారు.

రాజధాని అమరావతిలో ఖాజీ బోర్డు, ఖాజీభవన్ ఏర్పాటుకు ప్రత్యేక బిల్లు ను రూపొందించి అమలు చేయాలని కోరారు.

సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం – మంత్రి ఫరూక్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాజీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఖాజీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాజీలందరి తరపున పలువురు ఖాజీలు వారి సమస్యలను తన దృష్టికి పూర్తిస్థాయిలో తీసుకువచ్చారని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల సంక్షేమం కోసం దుల్హన్ పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయంలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి పునరుద్ధరించేందుకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఖాజీలందరు నైతికతతో న్యాయంగా సేవలందించాలని, చట్ట పరిధిలో పనిచేసి మన్ననలు పొందాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఖాజీ ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని మంత్రి ఫరూక్ ప్రభుత్వ ఖాజీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *