Breaking News

కేంద్రం వక్ఫ్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలి…

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్‌బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ అహలే సున్నతుల్‌ జమాత్‌ పెద్దలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దేశంలో మరోసారి ఎస్‌ఆర్సీ స్థాయి పోరాటం తప్పదని హెచ్చరించారు. వక్ఫ్‌బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజాలు తెలుపుతున్న నిరసనలో భాగంగా రాష్ట్ర అహలే సున్నతుల్‌ జమాత్‌ ఆధ్వర్యంలో కొండపల్లి హజరత్‌ సయ్యద్‌ షా బుఖారి బాబా ప్రాంగణంలో బుధవారం సున్నీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సున్నీ జమాత్‌కు చెందిన ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు బిల్లును వ్యతిరేకిస్తే తప్పకుండా పార్లమెంట్‌లో బిల్లు వీగిపోతుందన్నారు. ఇందుకోసం ఈ రెండు రాష్ట్రాల ముస్లింలు ఆయా ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ముస్లింల పక్షపాతిగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింల వ్యతిరేక చర్యలకు మద్దతు తెలపరని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎంను కలిసి సమస్యలను వివరిస్తామని, తప్పకుండా తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఉందన్నారు. ప్రపంచ ముస్లిం జనాభాలో అత్యధిక శాతం కలిగిన సున్ని జమాత్‌కు మాత్రమే ఒక బోర్డుపై పూర్తి అధికారం వుందని, నూతనంగా వచ్చే బిల్లుతో వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఎన్నో వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం అవడంతో ముస్లిం సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైల్వే ఆస్తుల తర్వాత ఆ స్థాయి ఆస్తులు ఉన్న వక్ఫ్‌బోర్డు ముస్లింల అభ్యున్నతికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. వక్ఫ్‌ బోర్డు దర్గా, పంజాలకు సంబంధించిన ఆస్తి అని, వాటిపై నమ్మకం లేని ఇతర ముస్లిం తెగలకు అధికారాలు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి వెనక్కి తగ్గాలని, లేని పక్షంలో దేశంలోని ప్రతి ముస్లిం తన కుటుంబంతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఫ్టీ సుల్తాన్‌ రాజా, అజ్మీర్‌ నుంచి విచ్చేసిన సూఫీ అజ్మీరే సాజిద్‌ హుస్సేన్‌, జంషద్‌ పూర్‌ టాటాకు చెందిన ముప్తీ సలాహుద్దీన్‌, షాహిద్‌ రజా, బిలాల్‌ నాసిక్‌, రాష్ట్ర ఆలేస్‌ సున్నతులు జమాత్‌ కన్వీనర్‌ గౌహార్‌ ఆలం, అహలే సున్నతుల్‌ జమాత్‌ బోర్డు కో కన్వీనర్‌, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్‌ రజా, ముక్తిసమివుజమా, నయీమ్‌ అక్తర్‌, అప్సర్జమా, వివిధ ప్రాంతాల ముస్లిం మత గురువులు, ముతవల్లీలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *