Breaking News

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలు

-శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పుణ్య క్షేత్ర సందర్శన తో శ్రీకారం
-రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ సమీపంలోని టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద టూరిజం బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-జెండా ఊపి ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ , కూటమి ప్రజా ప్రతినిధులు
-భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామన్న మంత్రి
-కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు.. భక్తుల కోరిక మేరకు ఆదివారం కూడా ఏర్పాటు చేసే యోచన
-అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
-రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం (ఐఆర్ఓ) వద్ద ఉదయం 6 గం.లకు బస్సులు ప్రారంభం.. రాత్రి 7.30 కి గోదావరీ హారతి తో ముగియనున్న ప్రయాణం..
-మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టూరిజం శాఖ ఉన్నతాధికారులు, బోర్డ్ డైరెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభమైన పర్యాటక యాత్ర బస్సులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒకరోజు ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం లోని సరస్వతి ఘాటు వద్ద ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం దగ్గర ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీ బస్సును మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఒక రోజు పూర్తి ఆధ్యాత్మిక భావంతో దేవాలయాలను సందర్శించుకుని యాత్రికులు ఇంటికి తిరిగి వెళ్లేలా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

2025 మార్చి నాటికి ప్రస్తుత టూరిజం పాలసీ ముగుస్తుందని ఏప్రిల్ 2025 నుంచి కొత్త టూరిజం పాలసీ అమల్లోకి తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే కొత్త టూరిజం పాలసీకి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేశామని పేర్కొన్నారు. టూరిజం శాఖలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టూరిజం బోర్డ్, అధికారులు, అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో రాజానగరం, రాజమండ్రి, అనపర్తి ఎమ్మెల్యేల సూచనల మేరకు వారాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పంచారామ క్షేత్రాలను కలిపేలా ఒక రోజు టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులకు రాజమండ్రి లోని సరస్వతి ఘాట్ వద్ద ఉన్న ఐ ఆర్ ఓ కార్యాలయం దగ్గర ప్రతి శనివారం బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలుత అత్యంత ప్రసిద్ధి చెందిన కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం, రత్నగిరి కొండపై వెలసిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ దర్శనం, ఆ తర్వాత పితృముక్తి క్షేత్రంగా, పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం దర్శించిన పిమ్మట విశాలమైన ప్రాకారాలతో, చాళక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు దర్శించుకొంటారని తెలిపారు. సామర్లకోట దేవాలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరించిన అనంతరం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు సందర్శిస్తారని తెలిపారు. ఆ తర్వాత అనపర్తి లోని లక్ష్మీ గణపతి దేవాలయాన్ని, కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని యాత్రికులు సందర్శించేలా, తదుపరి పుష్కర్ ఘాట్ లో గోదావరీ హారతి తో ఒక రోజు పుణ్య క్షేత్ర యాత్ర పూర్తి అవుతుందన్నారు.

ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు బస్సులు ప్రారంభమై రాత్రి 7.00 గంటలకు రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి దగ్గర పుష్కర్ ఘాట్ కు చేరుకుంటుందన్నారు. అక్కడే పవిత్ర గోదావరి నదికి కన్నుల పండువగా హారతి ఇచ్చే ప్రాంతంలో మంత్ర ముగ్ద దృశ్యాలను భక్తులు తిలకించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. భక్తులు అధ్యాత్మిక ప్రపంచంలో మునిగి తేలేలా కార్యక్రమం పూర్తయిన అనంతరం 7.30 గంటలకు తిరిగి రాజమహేంద్రవరంలోని ఏపీటీడీసీకి చెందిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్దకు భక్తులను చేరవేస్తామన్నారు. ఇంతటితో యాత్ర సమాప్తమవుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాలతో రాష్ట్రంలో ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, టెంపుల్ టూరిజం లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లు గా చేసి సత్ఫలితాలు సాధించాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి గండికోట, అఖండ గోదావరి సూర్యలంక బీచ్ తదితర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ లను పంపించామని త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నా మన్నారు. ఒక పర్యాటకుడు ఏదైనా పర్యాటక ప్రాంతానికి వస్తే రెండు మూడు రోజులు ఉండేలా మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ క్రమంలోనే రిసార్ట్ లు ఏర్పాటు, టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.

రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ, దేవదాయ శాఖ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకునేలా ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయిందని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. తద్వారా అన్ని శాఖలు ఇంటిగ్రేటెడ్ గా పనిచేస్తే పర్యాటక అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దిశా నిర్దేశం చేశారన్నారు.. పర్యాటక అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి సందర్భంగా మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.

సెప్టెంబర్ 27న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. పర్యాటక రంగానికి ఇది శుభ పరిణామమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఒకే ఒక ఇజం ఉంటుంది అదే టూరిజం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మంత్రి కందుల దుర్గేష్ గుర్తు చేశారు. గడచిన ఐదేళ్లలో పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని, పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ శాయశక్తుల కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు..

ఋషికొండ బీచ్ బ్లూ ఫాగ్ బీచ్ గా సర్టిఫికెట్ పొందిందని దానితోపాటు కాకినాడ బీచ్, సూర్యలంక బీచ్, రామాపురం బీచ్, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ లు బ్లూ ఫాగ్ బీచ్ లుగా రూపాంతరం చెందేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర టూరిజం బోర్డ్ సభ్యులు గంటా స్వరూప దేవి, వాసిరెడ్డి రాంబాబు, టూరిజం ఆర్డీ వి స్వామి నాయుడు, యాత్రికులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *