అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రేపు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో “గుంతల రహిత రోడ్ల” మిషన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా మిషన్ మోడ్ లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు. రేపు లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ మోడ్ లో రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేపడతామని మంత్రి తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 290 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి నుంచి రూ. 220 కోట్ల నిధులు, రహదారులు మరమ్మతులుకు సంబంధించి రూ. 350 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ గుంతల రహిత రోడ్ల మిషన్ విజయనగరం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రోడ్ల మరమ్మతుల పనులను లాంఛనంగా ప్రారంభించడం మొదలవుతోందని, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా రోడ్ల మరమ్మతుల పనులు మొదలవుతాయన్నారు. అలాగే ఈ రోడ్ల మరమ్మతులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎటువంటి అలసత్వానికి రోడ్ల మరమ్మతుల విషయంలో చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా రోడ్ల మరమ్మతులు పూర్తైన తర్వాత సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి గుంతలు రహిత రోడ్ల సర్టిఫికేట్లు ఇవ్వడంతో పాటు, ఈ కార్యక్రమం నిరంతరం అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
గత వైసీపీ పాలనలో ప్రజలకు రోడ్డు మీదకు రావాలంటే భయం వేసే దుస్థితి.. గత ఐదేళ్లుగా దురదృష్టవశాత్తూ రాష్ట్రంలోని మెజార్టీ రోడ్లు అధ్వాన్నస్థితిలో ఉన్నాయి.. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఆర్ధికంగా సుస్థిరాభివృద్ధి సాధించాలన్నా.. పరిశ్రమలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలన్నా, ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనే కీలకం.. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సమగ్ర ప్రణాళికతో అడుగులు వేస్తోంది.. ప్రాధాన్యత క్రమంలో ఆయా రోడ్లకు సంబంధించిన పనులకు ఆమోదం తెలపడం, మరమ్మతులు చేయడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు.. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో పూర్తిగా గుంతలమయంగా మారిపోయిన రోడ్లను గుంతల రహితంగా మార్చాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడంతో పాటు, గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న రూ. 350 కోట్ల బిల్లులను తక్షణమే కాంట్రాక్టర్ లకు విడుదల చేయడం జరిగింది..
గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో గతుకుల, గుంతల రోడ్లతో ప్రజలు పడిన అవస్థలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన, మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి & నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా అమలవుతున్న నూతన విధానాలపై, సరికొత్త టెక్నాలజీలపై సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణం – మరమ్మతుల్లో అధునాతన విధానాలు అవలంభించేందుకు ఇప్పటికే SRM యూనివర్సిటీ, ఐఐటీ – తిరుపతి వంటి సంస్థల భాగస్వామ్యంతో పనిచేసేందుకు ఆర్ & బీ శాఖ ఎంవోయూలు కుదుర్చుకోవడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధిలో అమలవుతున్న నూతన విధానాలను అధ్యయనం చేసేందుకు ఆర్ & బీ శాఖ మంత్రిగా ఇటీవల గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానంలో చేపడుతున్న రోడ్లు, రోడ్ అసెట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (RAMS) లను పరిశీలించడం జరిగింది. ఆయా విధానాలను మన రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను సైతం పరిశీలిస్తున్నాం..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయి. ముఖ్యమంత్రితో పాటు, తాను కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడం, ఆయన దృష్టికి సమస్యలు తీసుకురావడంతో పాటు, ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలకు సైతం పరిష్కారం లభించింది. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో 129 నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి 3,300 కి.మీ మేర హైవేల పనులు నిర్మాణంలో ఉన్నాయి.. అంటే రాష్ట్రంలో మొత్తంగా రూ. 76 వేల కోట్ల ఎన్ హెచ్ పనులు జరుగుతున్నాయని, ఇవి కాకుండా రానున్న రోజుల్లో మరో రూ. 30 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
Tags amaravathi
Check Also
రాయచోటిలో ఎన్‌సిసి యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి..మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-యువతలో నైపుణ్యం పెండచానికి ఎన్‌సిసి తోడ్పడుతుంది. -రాయలసీమలో ఎన్‌సిసి వృద్ధి కోసం కావలసిన విభాగపరమైన సహాయ సహకారం అందిస్తాము. -రాష్ట్ర …