-సబ్ కలెక్టర్ జి. సాయిసూర్య ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19 నుంచి స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించబడునని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సాయిసూర్య ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ డివిజన్లో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు తగ్గుదల నేపధ్యంలో డివిజన్‌లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ఈ నెల 19 నుంచి ప్రతి సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మ. 2 గంటల వరకు స్పందన కార్యక్రమం ద్వారా విజ్ఞప్తులు స్వీకరించబడునని చెప్పారు. అయితే డివిజన్‌లోని ప్రజలందరూ కూడా తమ తమ సాధారణ విజ్ఞప్తులను సాధ్యమైనంత వరకు గ్రామ వార్డు సచివాలయాల్లోనే అందజేసి సంబంధిత శాఖ మండల స్థాయి అధికారుల వారిని సంప్రదించి పరిష్కారించుకోవచ్చునని సూచించారు. అక్కడ పరిష్కరింపలేని, పరిష్కరింపబడని, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విజ్ఞపులకు మాత్రమే తగు ఆధారాలతో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో ఉదయం 10 నుంచి మ, 2 గంటల వరకు తమకు స్వయంగా అందజేయవచ్చునని సబ్ కలెక్టర్ తెలియజేశారు. ముఖ్యంగా స్పందన కార్యక్రమానికి ఈ కార్యాలయానికి వచ్చే సమయంలో కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆ ప్రకటనలో సబ్ కలెక్టర్ కోరారు.