Breaking News

రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ నుండి నిర్వహించిన రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొన్న పదిహేనువందల మంది పై చిలుకు సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలోని కొంతమంది అధికారుల తీరుతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి సమావేశంలో ప్రధానంగా చర్చించారని ఎం.డి.జాని పాషా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటనలో తెలిపారు.

క్షేత్ర స్థాయిలోని కొందరు అధికారులు ఉన్నత అధికారులకు మరియు ప్రభుత్వానికి తెలియనివ్వకుండా ఏక కాలంలో అనేక రకాల చేయలేని పనులను అప్పగిస్తున్నారు. తగినంత సమయం కూడా ఇవ్వకుండా టార్గెట్లు విధించి ఉద్యోగులను తీవ్ర మానసిక మరియు పని వత్తిడికి గురిచేస్తున్నారు. ఉద్యోగులకు కనీసం మానసిక ప్రశాంతత లేకుండా చేయడమే కాకుండా సచివాలయ ఉద్యోగులను వారి కుటుంబాలతో గడిపే సమయం కూడా లేకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా, సమయ పాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కార్యాలయ పని వేళలు కాని సమయాల్లో టెలీ కన్ఫరెన్సులు, భౌతిక సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులను నరకయాతనకు గురిచేయడం పట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వత్తిడి భరించలేక తల్లడిల్లిపోతున్నారని ఉద్యోగులు సమావేశం దృష్టికి తీసుకొని వచ్చారు.

ఉన్నత విద్యావంతులు మరియు ప్రతిభావంతులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రామ వార్డు స్థాయి నుండి ప్రతి మండల మునిసిపల్, డివిజనల్ ,జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్లు, రీజనల్ కార్యాలయాలు, రాష్ట్ర కమీషనరేట్లు, డైరెక్టరేట్లు, హెచ్.ఒ.డి కార్యాలయాలు రాష్ట్ర సచివాలయం, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యుల వద్ద, మంత్రిత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం వరకు అనేక ప్రదేశాలలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటువంటి ఉద్యోగులను క్షేత్ర స్థాయిలో కొంతమంది అధికారులు వేధింపులకు గురిచేస్తున్న అనేక సందర్భాలను ఉద్యోగులు సమావేశంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలని కోరారు. టాయిలెట్స్ ఫోటోలు తీసే బాధ్యతల నుండి విద్యా కార్యదర్శులు మరియు సంక్షేమ సహాయకులకు విముక్తి కల్పించాలని ఉద్యోగులు కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ మరియు నోష్నల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కోసం కృషి చేయాలని ఉద్యోగులు సమావేశంలో ప్రధానంగా కోరారు.

పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-6 వారికి టెక్నికల్ విభాగంలో పదోన్నతులు కల్పించాలని, వార్డు విద్యా కార్యదర్శులకు విద్యా శాఖలో మరియు టెక్నికల్ విభాగంలో ప్రమోషన్ కల్పించాలని, వ్యవసాయ అనుబంధ విభాగాల ఉద్యోగులకు బదిలీలు సాధించాలని, సర్వే అసిసిస్టెంట్లకు ప్రమోషన్లు రీసర్వే సమస్యల నుండి విముక్తి కల్పించాలని, ఎ.యన్.ఎం లకు కేవలం వారి శాఖా పరమైన విధులు మాత్రమే అప్పగించాలని, అలాగే వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు కార్యాలయ పని వేళలు అమలు, మరియు వివిధ శాఖల్లో విలీనం చేయాలని, పంచాయతీ కార్యదర్శులకు మరియు వార్డు పరిపాలన కార్యదర్శులకు ప్రమోషన్లు మరియు తొలగించిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా తిరిగి ఇవ్వాలని, వార్డు వెల్ఫేర్ సెక్రటరీలకు పదోన్నతులు, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు మరియు ఎమినిటీస్ సెక్రటరీలకు టెక్నికల్ పదోన్నతులు ప్లానింగ్ మరియు సాంకేతిక శాఖల్లో విలీనం చేసేలా కృషి చేయాలని, వార్డు మరియు గ్రామ రెవిన్యూ అధికారులకు రెవిన్యూ అధికారుల ద్వారా వారి శాఖాపరమైన పనులను మాత్రమే అప్పగించాలని, ఎనర్జీ అసిసిస్టెంట్లకు రక్షణ కల్పించాలని వారిని విద్యుత్ శాఖలో విలీనం చేసి అక్కడి సర్వీస్ నిబంధనలు రాయితీలు ఇప్పించాలని ఉద్యోగులు సమావేశంలో కోరారు. దివ్యాంగ ఉద్యోగులకు క్షేత్ర స్థాయి ఫీల్డ్ విధుల నుండి విముక్తి కల్పించి కేవలం కార్యాలయ విధులు మాత్రమే అప్పగించాలని కోరారు.

సమావేశంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల విధులనుండి విముక్తి కల్పించాలని, ఇంటింటికి తిరిగే విధుల నుండి వెసులుబాటు కల్పించి, ఉద్యోగుల ఆత్మ గౌరవం కాపాడడం కోసం సంఘం కృషి చేయాలని, క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలని కోరారు. దాదాపు ముడున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల నుండి ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బత్తుల.అంకమ్మరావు రాష్ట్ర ప్రధానకార్యదర్శి, జి.హరీంద్ర రాష్ట్ర సహ అధ్యక్షులు, బోల్లేపల్లి పుల్లారావు రాష్ట్ర కోశాధికారి,రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి.కిరణ్ కుమార్, కె.రామకృష్ణా రెడ్డి,బి.రోజా ప్రకాష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యస్.కె.సుభాని, రాష్ట్ర సమన్వయకర్త ఎం.శశిధర్, రాష్ట్ర కార్యదర్శులు కె.మురళీ కృష్ణ, చంద్ర.సిరాల, దారా.సురేష్ బాబు, పి.అశ్వర్థ, నాగరాజు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *