విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సుప్రీంకోర్టు తీర్పు, ఎన్.సి.టి.ఈ. నిబంధనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పెషల్ టెట్‌పై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టులను ఆశ్రయిస్తూ ఉపాధ్యాయుల్లో అనవసర గందరగోళం, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలను రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర (ఎస్.టి.యు.) తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి వ్యాజ్యాల వెనుక అసలు ప్రజా ప్రయోజనం ఏమిటో సంబంధిత వ్యక్తులు స్పష్టం చేయాలని ఎస్.టి.యు. ప్రశ్నిస్తోంది.
దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు సైతం ఎన్.సి.టి.ఈ. నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ అర్హత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా, తాము బోధించని సబ్జెక్టుల్లో సైతం పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక టెట్ నిర్వహించడం సముచితమైన చర్యగా ఎస్.టి.యు. భావిస్తోంది.
ఈ ప్రత్యేక టెట్ వల్ల నిరుద్యోగులకు ఎలాంటి పోటీ ఏర్పడదు. కొత్త ఉద్యోగాల భర్తీకి ఇది ఏమాత్రం సంబంధం లేని పరీక్ష. ఇది ఉద్యోగ నియామక పరీక్ష కాదు, ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి అర్హతకు సంబంధించిన పరీక్ష మాత్రమే. అలాంటప్పుడు ఈ పరీక్షను అడ్డుకోవడం ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నవారు సమాధానం చెప్పాలి.
అలాగే, ఏ పరీక్ష నిర్వహణలోనైనా అభ్యర్థుల సన్నద్ధత కోసం సిలబస్, మాదిరి ప్రశ్నలు, బిట్ బ్యాంకులు అందించడం సాధారణ ప్రక్రియ. అదే విధంగా రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్పెషల్ టెట్ కోసం విద్యాశాఖ 16,000కు పైగా మాదిరి ప్రశ్నలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటి ఆధారంగా పరీక్షలో 150 ప్రశ్నలు మాత్రమే ఉంటాయని గమనించాలి. ఉపాధ్యాయులకు సన్నద్ధమయ్యే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తించాలి.
ఎటువంటి వర్గానికీ నష్టం కలిగించని, నిరుద్యోగుల అవకాశాలను దెబ్బతీయని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల అర్హతకు సంబంధించిన ప్రత్యేక పరీక్షపై అనవసర వివాదాలు సృష్టించడం ఎంతవరకు సమంజసం? న్యాయస్థానాలను ఆశ్రయించడం ప్రతి ఒక్కరి హక్కే అయినప్పటికీ, ఆ హక్కును వినియోగించుకునే క్రమంలో వేలాది మంది ఉపాధ్యాయుల్లో అనవసరమైన అభద్రతాభావం, ఆందోళన కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
ఉపాధ్యాయుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను ఎస్.టి.యు. సహించబోదు. స్పెషల్ టెట్‌పై అనవసర అపోహలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని ఎస్.టి.యు డిమాండ్ చేస్తోంది.
ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకలపల్లి సాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు
