గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా ఎన్నికల నిబంధనలను పాటించాలని గుంటూరు నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O.Rt.No.1288 (MA&UD శాఖ, తేదీ: 17.10.2026) ఆధారంగా, ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిపై కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవచ్చని, అయితే తాము ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు కేటాయించిన ఎన్నికల విధులను ఎలాంటి పక్షపాతం లేదా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావులేకుండా అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. అంతేకాకుండా, ఉద్యోగులు ఎలాంటి ఎన్నికల ప్రచారాలు, రాజకీయ సభలు, నిరసనలు లేదా ర్యాలీలలో పాల్గొనకూడదని, తమ అధికారిక హోదాను ఏ అభ్యర్థికి లేదా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉపయోగించకూడదని హెచ్చరించారు. వాహనాలు, నివాస గృహాలు లేదా తమ శరీరంపై ఎలాంటి పార్టీ గుర్తులను లేదా రంగులను ప్రదర్శించరాదని మరియు ఏ అభ్యర్థికి కూడా ఎలక్షన్, పోలింగ్ లేదా కౌంటింగ్ ఏజెంట్గా వ్యవహరించకూడదన్నారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే రూ.500 వరకు జరిమానా విధించబడుతుందని, ఏ అభ్యర్థికైనా ఎలక్షన్ ఏజెంట్గా వ్యవహరిస్తే 3 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయని తెలిపారు. అలాగే, బూత్ క్యాప్చరింగ్ చేయడం లేదా ఓటర్లను బెదిరించడం వంటి చర్యలను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి, అటువంటి వారిపై 3 నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ మరియు ‘ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1964’ ప్రకారం తమ విధులను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించే ఉద్యోగులకు ప్రభుత్వం మరియు ఎన్నికల అథారిటీ తరఫున పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులందరూ ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా మరియు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
