-సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ కె.చంద్రశేఖర రావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ కె.చంద్రశేఖర రావు అన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ ప్రతి అంశాన్నీ వారు పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక పంపాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో శనివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సూక్ష్మ పరిశీలకు (మైక్రో అబ్జర్వర్సు) కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన కృష్ణా- గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికకు జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించమన్నారు. సూక్ష్మ పరిశీలకులు ముందుగా ఆయా పోలింగ్ కేంద్రపరిధిలో కనీస సౌకర్యాలను తనిఖీ చేసి సాధారణ పరిశీలకులకు నివేదిక ఇవ్వటం జరగాలన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. సీక్రసీ ఆఫ్ ఓటు ఉండేలా చూడాలని, నిబంధనలు మేరకు ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ బూత్‌లో ఎన్నికల సిబ్బంది, పోలింగ్ ఏజెంట్‌లు ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలని తెలిపారు. పోలింగ్ బూత్ లోకి వచ్చిన ఓటర్లతో ఏజెంట్లు కాకుండా ఎన్నికల సిబ్బంది మాత్రమే మాట్లాడాలని సూచించారు. బూత్‌లో ఎలాంటి క్యాంపయిన్ జరగకూడదని, లోపలకు మొబైల్ ఫోన్‌లను అనుమతించకూడదని చెప్పారు. పార్టీ గుర్తులు, రంగులు, కండువాలు, జెండాలు వంటివి ఉండకూడదన్నారు. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల దూరం లోపల ఎలాంటి ప్రచారం జరగకూడదని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థికి ఒక్కరు మాత్రమే బూత్‌లో ఉండాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో తీసుకోవలసిన విధానాలు, జాగ్రత్తలపై మాస్టర్ ట్రైనర్ వై. మృదుల వివరించారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్‌వో తో పాటు కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News