దసరా ఉత్సవాల్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు విజయవంతం

WhatsApp Image 2026 10 23 at 5.16.25 PM

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మరియు డా. ఏ.ఎల్. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, విజయవాడ సంయుక్తంగా ఈ నెల 11 తేదీ నుండి 23 వ తేదీ వరకు 13 రోజులపాటు నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు విజయవంతంగా ముగిశాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ సంచాలకులు శ్రీ గోపాల కృష్ణ రోణంకి , ఐ.ఏ.ఎస్. గారి ఆదేశాల మేరకు, దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానానికి విచ్చేసే భక్తులకు నాణ్యమైన ఆయుర్వేద వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలను నిర్వహించారు.

ఈ వైద్య శిబిరాలకు భక్తులు, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాల ద్వారా దాదాపు 25,000 మంది భక్తులు, ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. వైద్య బృందాలు మూడు షిఫ్టుల్లో భక్తులకు చికిత్సలను అందించాయి. దూరప్రాంతాల నుండి నడిచి వచ్చే భక్తులకు వైద్యుల సూచనల మేరకు పాదాలు మోకాళ్లు మొదలైన కీళ్ల నొప్పులకు ఆయిల్ మసాజ్ చికిత్సలు కూడా అందించారు.

ఈ వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించడం లో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ జి. లక్ష్మీశ గారు (ఐ.ఏ.ఎస్.)
దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీ సీనా నాయక్ అందించిన సహకారానికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ శిబిరాలను డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ప్రిన్సిపాల్ డా. టి. బుల్లయ్య , డా. ఏ.ఎల్. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. పి. జగదీష్ గారి పర్యవేక్షణ, సమన్వయంతో నిర్వహించారు.

రెండు సంస్థలకు చెందిన అధ్యాపకులు, వైద్యులు, ఆయుర్వేద పీజీ విద్యార్థులు, ఇంటర్నీలు మరియు ఇతర సిబ్బంది ఈ శిబిరాల్లో చురుకుగా పాల్గొని భక్తులకు అంకితభావంతో వైద్య సేవలను అందించారు.

ఈ వైద్య శిబిరాల విజయవంతమైన ముగింపు ఆయుష్ శాఖతో పాటు రెండు ప్రభుత్వ ఆయుర్వేద సంస్థలు ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలను అందించడంలో, ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహించడంలో చూపుతున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా, ప్రధాన పండుగలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా భక్తులకు వైద్య సేవలను అందించడంలో ఈ శిబిరాలు విశేషంగా దోహదపడ్డాయి.