-మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
-ప్రశాంతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
-ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
-క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్ల నివేదికల ఆధారంగా నిర్ణయాలు
-రేపు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-రాష్ట్రవ్యాప్తంగా 2.61 కోట్ల మంది ఓటర్లు.. 31,460 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
-ఎన్నికల విధుల్లో దాదాపు 2.52 లక్షల మంది సిబ్బంది.. కౌంటింగ్ కోసం సుమారు 52 వేల మంది సిబ్బంది
-పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత.. సీసీటీవీ, వీడియోగ్రఫీతో నిరంతర పర్యవేక్షణ
-ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులు, మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ…
వర్షాల ప్రభావం, పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది సంసిద్ధత తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. చాలా జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, పరిమిత సంఖ్యలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించినట్లు వెల్లడించారు.
వాతావరణ పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డా. ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో సుమారు 2,52,000 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బంది కొరత తలెత్తకుండా అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం సుమారు 52,000 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.
పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎదురయ్యే రవాణా, ఇతర స్థానిక సమస్యల పరిష్కారంపై కూడా సమీక్షించినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీని కేవలం బయటకే పరిమితం చేయకుండా, పరిస్థితులను బట్టి లోపల కూడా నిర్వహించాలని సూచించారు. అయితే, ఓటు రహస్యానికి ఎలాంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నప్పుడు సంబంధిత ఘటనకు సంబంధించిన దృశ్యాలను తప్పనిసరిగా రికార్డు చేయాలని ఆదేశించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ప్రతి ప్రిసైడింగ్ అధికారికి సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా మార్గదర్శకాలు అందించాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేని ప్రిసైడింగ్ అధికారులకు ఇతర పీవోలు లేదా పోలీసు అధికారుల ఫోన్ల ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల లోపల మాల్‌ప్రాక్టీస్ లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న పక్షంలో ప్రిసైడింగ్ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోనల్ మేజిస్ట్రేట్ లేదా పోలీసు అధికారులను సంప్రదించి పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలని సూచించారు.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగి సుమారు 2.61 కోట్లకు చేరుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది ముందస్తు ప్రణాళికతో, క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. మైక్రో లెవెల్ ప్లానింగ్‌తో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ…
మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషనర్ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. అదే తరహాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి మైక్రో లెవెల్ ప్లానింగ్ రూపొందించామని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సెక్టార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తున్నామని తెలిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీని నియంత్రించడం, క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, అవసరమైన చోట తగినంత పోలీసు బలగాలను మోహరించడం కీలకమని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా బలగాల మోహరింపును చేపట్టి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ మాట్లాడుతూ…
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థానాల్లో మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టామని తెలిపారు.
