-సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
-టాప్ హాట్స్ అండ్ టెయిల్ కోట్స్ పుస్తకావిష్కరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యం ఎంతో గొప్పదని దీని విలువను తెలుసుకొని నడుచుకోవాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం ఉదయం ఏయు హిందీ విభాగం సమావేశ మందిరంలో డాక్టర్ ప్రయాగ మురళి మోహనకృష్ణ రచించిన టాప్ హాట్స్ అండ్ టెయిల్ కొట్స్ అంగ్లాగ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు మన దేశం సత్యానికి ఇచ్చే విలువను గుర్తించి వారు ఇదే విషయాన్ని గ్రంధాలలో పొందుపరిచారన్నారు. భాషలు ఎన్ని అయినా నేర్చుకోవచ్చునని అదే సమయంలో ఇతర భాషలపై పెత్తనం చేయడం సరికాదన్నారు. ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం అవసరమన్నారు. భాషాపరంగా ఎదురైన కొన్ని అవరోధాలు, తన జీవితంలోని పలు సంఘటనలను ఈ సందర్భంగా వివరించారు. పుస్తక రచయితను అభినందించి పుస్తకం పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
కాకినాడ శ్రీ పీఠాధిపతి శ్రీ శ్రీ స్వామి పరిపూర్ణానంద సరస్వతి మాట్లాడుతూ భారతీయుల గొప్పదనాన్ని విదేశీయులు చూసే పరిస్థితి నేడు దేశంలో ఉందన్నారు. బుద్ధి బలంగా ఉండాలని ఇది బలహీనపడితే మనపై దాడులు పెరుగుతాయని చెప్పారు. అబద్దాన్ని నిజం అనిపించే విధంగా ప్రచారాలు చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయిందని చెప్పారు. మన భాషని, సంస్కృతిపై వేరొకరు ఆదిపత్యం చూపడం ఎంత మాత్రం తగదని అన్నారు. మాతృభాషా ఉద్యమాలు, తెలుగు సంఘాలు భాషా పరిరక్షణకు వారు పడుతున్న తపన, చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని చెప్పారు. ప్రపంచీకరణ పేరుతో భారతీయులపై విభిన్న అంశాలను రుద్దడం జరుగుతోందని చెప్పారు.
సభాధ్యక్షులు, రాజ్యసభ పూర్వ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తిగా డాక్టర్ ప్రయాగ మురళీమోహన్ కృష్ణ తనకు సుపరిచితులని చెప్పారు. విదేశాలకు వెళ్లిన ఈ దంపతులు తమ సంస్కృతిని ఎప్పుడు విడువలేదని గుర్తు చేశారు. నిజాయితీగా రాసిన పుస్తకంగా ఇది నిలుస్తోందని చెప్పారు. విదేశీ వ్యామోహం, వారు చెప్పినదే విని బతకాలి అనే విధానాలను తనదైన శైలిలో నిర్మొహమాటంగా ఈ పుస్తకంలో వివరించిన విధానాన్ని అభినందించారు. నేడు విశ్వ గురువుగా భారత్ నిలుస్తోందని చెప్పారు. గతంలో బానిస మనస్తత్వం ఉండేదని, నాటి దుస్థితి నుంచి నేటి సుస్థితికి దేశ పరిస్థితి మారిందని గుర్తు చేశారు. భారతీయుల ఆత్మను ఆవిష్కరించిన పుస్తకంగా ఇది నిలుస్తుంది అని చెప్పారు.
అమెరికా నుంచి వచ్చిన సన్యాసి రామ్ మాట్లాడుతూ తన అనుభవాలను ఈ పుస్తకంలో రచయిత వివరించారని చెప్పారు. ప్రతి వ్యక్తి తనకు తాను నిజాయితీగా ఉండడం ఎంతో ప్రధానమని అన్నారు. పుస్తక రచయిత డాక్టర్ ప్రయాగ మురళీమోహన కృష్ణ మాట్లాడుతూ శరీర వర్ణం ఆధారంగా వ్యక్తులను చూడటం ఎంత మాత్రం సరికాదన్నారు. కార్యక్రమంలో పుస్తక సంపాదకులు శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత డాక్టర్ ప్రయాగ మురళి మోహనకృష్ణ దంపతులను, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ దంపతులు సత్కరించి నూతన వస్త్రాలతో గౌరవించారు. కార్యక్రమంలో ఆచార్య వి.బాల మోహన్ దాస్, ఆచార్య వి. ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.