-తహసీల్దార్ ఎం.సూర్యారావుపై శాఖాపర చర్యలకు
-కలెక్టర్ డా. జి.లక్ష్మీశా ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు వరద ప్రభావిత ప్రజలకు ఆర్థిక సహకారానికి సంబంధించి అర్జీల విచారణలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించినట్లు ప్రాథమికంగా తేలడంతో విజయవాడ నార్త్ తహసీల్దార్ ఎం.సూర్యారావుపై శాఖాపర చర్యలకు వీలుగా అభియోగాలు మోపేందుకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలిచ్చారు. బుడమేరు వరదలతో ముంపు ప్రభావానికి గురయ్యామని.. తమకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందలేదంటూ విజయవాడ నార్త్ మండల పరిధిలోని దాదాపు 500 మంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీలు సమర్పించారు. వీటిపై సరిగా విచారణ జరపకుండా, దరఖాస్తు చేసుకున్నవారందరూ ప్రాథమికంగా అర్హులే అంటూ తహసీల్దార్ ఎం.సూర్యారావు దరఖాస్తుదారులకు ఎండార్స్‌మెంట్ ద్వారా తెలియజేశారు. అయితే తదుపరి విజయవాడ ఆర్‌డీవో విచారణలో దరఖాస్తుదారుల్లో కొందరు మాత్రమే అర్హులని నిర్ధారించడం జరిగింది. ఈ నేపథ్యంలో అర్హుల నిర్ధారణ విషయంలో సందిగ్ధ పరిస్థితులకు కారణమైన తహసీల్దార్ సూర్యారావుపై ఏపీ సీఎస్ (సీసీ అండ్ ఏ) రూల్స్, 1991 కింద శాఖాపర చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. తుది విచారణ ఆధారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. అవసరమైతే సస్పెండ్ లేదా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.