– విభిన్న ప్రతిభావంతులకు అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తాం
– సదరం సర్టిఫికెట్ల జారీ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు
– రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని.. తమతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం స్వయం ఉపాధికి ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు.
మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విజయవాడ, మొగల్రాజపురం, సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సభాధ్యక్షత వహించగా.. రాష్ట్ర విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, డైరెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తదితరులు హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే చట్టాలు, విధానాల అమల్లో ముందంజలో ఉన్నామని.. ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాల అమలుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సమూలంగా మారబోతోందని.. ఇప్పటికే రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతోందని, ఆ నివేదికలను గౌరవ ముఖ్యమంత్రి ముందుపెట్టి, ఆయన మార్గనిర్దేశనంతో ముందడుగు వేయనున్నట్లు వివరించారు. ఉద్యోగం అనేది ఒక ఆప్షన్ మాత్రమేనని.. స్వయం ఉపాధి ద్వారా మనతో పాటు మరో 50 మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. ఇందుకు ప్రభుత్వం పరంగా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు.
సమగ్రాభివృద్ధి లక్ష్యంగా: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విభిన్న ప్రతిభావంతుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలుచేయడం జరుగుతోందని, వాటి ఫలాలు విభిన్న ప్రతిభావంతులకు పూర్తిస్థాయిలో అందించేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
విభిన్న ప్రతిభావంతుల అవసరాలను గుర్తించి, వారి ఎదుగుదలకు చేయూతనందించేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 3ను అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంగా గుర్తించిందని.. 1992 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. సమగ్ర, సుస్థిర భవిష్యత్తు కోసం విభిన్న ప్రతిభావంతుల సారథ్యాన్ని విస్తరించడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా ప్రోత్సహించడం ఇతివృత్త సారాంశంతో ఈ ఏడాది దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో రూపొందిన విధానాలు, కార్యక్రమాలను జిల్లాస్థాయిలో పటిష్టంగా అమలుచేసి, ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్ది మంచి ఫలితాలు వచ్చేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రూ. 6 వేల పెన్షన్: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో వినిపించారు. ఆత్మవిశ్వాసాన్ని అణువణువునా నింపుకొని ముందడుగు వేస్తున్న విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు.. ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధిస్తారు.. అవరోధాలను అధిగమించి అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్న గౌరవ ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ అందిస్తోందన్నారు. విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరముందని.. ప్రజాప్రతినిధులుగా విభిన్న ప్రతిభావంతులు ఎదిగేలా కోటా ఉండాలన్న అంశాన్ని దివ్యాంగుల హక్కుల కోసం పోరాడే లక్ష్మీనారాయణ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని.. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. తేలిగ్గా ఉపకరణాలు పొందేందుకు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ విధానం గురించి, బ్రెయిలీ లిపి పాఠ్యపుస్తకాల గురించి విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ కుమార్ రాజా వివరించారు.
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంత చిన్నారుల నృత్యాలు అలరించాయి. విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ప్రతిభా సర్టిఫికెట్లు అందజేశారు. ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలు అందజేశారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన 61 మందికి మొదటి బహుమతులు, 61 మందికి ద్వితీయ బహుమతులు, 45 మందికి తృతీయ బహుమతులు అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలను సత్కరించారు.
కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి.కామరాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.