-అయిదు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు
-జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, మైలవరం మార్కెట్‌యార్డుల్లోనూ కొనుగోలు
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా జిల్లాలో అయిదు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభించిందని.. ప్రజాప్రతినిధులు అభ్యర్థన, రైతుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బుధవారం నుంచి జగ్గయ్యపేట, కంచికచెర్ల, నందిగామ, మైలవరం మార్కెట్‌యార్డుల్లోనూ కొనుగోళ్లు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పత్తి రైతులకు ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపే విధంగా జిల్లాలో ప్రారంభించవలసిన కొనుగోలు కేంద్రాలపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ కమిటీ సెక్రటరీలు, బయ్యర్ల తో మంగళవారం జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నందిగామ, మైలవరం, కంచికచర్ల, జగ్గయ్యపేట తిరువూరు మండలాల్లో ప్రధానంగా పత్తిని రైతులు పండిస్తున్నారన్నారు. రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దీనిలో భాగంగా నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులతో పాటు ఈ నెల 4వ తేదీ బుధవారం నుంచే జగ్గయ్యపేట, మైలవరం, కంచికచర్ల, నందిగామ మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. తిరువూరు పరిధిలోని మార్కెట్‌యార్డులోనూ కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్వింటాకు సీసీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.7521/- కు కొనుగోలు చేయాలన్నారు. రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు ఆరబెట్టి, సీసీఐ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్తిని తీసుకువచ్చి కనీస మద్దతుధర పొందే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రైతుల వద్ద పత్తి ఉన్నంతవరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటాయన్నారు. పత్తిని రైతులు ప్లాస్టిక్ సంచులలో కాకుండా లూజు, గన్నీ బ్యాగులలో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. రైతులు తమ పత్తి పంటను మార్కెట్ యార్డులో విక్రయించుకునేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి నందిగామ (91823 61191), మైలవరం (91823 61471), కంచికచర్ల (91823 61472), జగ్గయ్యపేట (91823 61470)లో సంప్రదించొచ్చని సూచించారు.
సమావేశంలో మార్కెటింగ్ శాఖ జేడీ కె.శ్రీనివాసరావు, సీసీఐ అసిస్టెంట్ మేనేజర్ హెచ్ రామప్రసాద్, మార్కెటింగ్ డీడీ పి.లావణ్య, ఏడీ కె.మంగమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, మార్కెటింగ్ కమిటీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.