– కళా సుస్థిరతకు ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతు
– తెల్ల పొణికి కొరత సమస్య పరిష్కారానికి జాయింట్ కమిటీ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు నేల సంప్రదాయ కళా ఔన్నత్యానికి కొండపల్లి బొమ్మలు చిహ్నమని.. సమష్టి కృషితో కొండపల్లి బొమ్మ కళకు పునర్వైభవం తెద్దామని, కళా సుస్థిరతకు ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతు ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌డీఏ, డ్వామా, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి కొండపల్లి బొమ్మల కళాకారుల సహకార సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. బొమ్మల తయారీకి ముడిసరుకు అయిన తెల్ల పొణికిని పరిశీలించడంతో పాటు కళాకారులు అద్భుత నైపుణ్యంతో చెక్కను అందమైన బొమ్మగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశా మీడియతో మాట్లాడారు. దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపున్న కొండపల్లి బొమ్మలకు డిమాండ్‌తో పాటు మార్కెటింగ్ అవకాశాలు బాగున్నప్పటికీ బొమ్మ తయారీకి అవసరమైన తెల్ల పొణికి లభ్యత సమస్యగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో తెల్ల పొణికి నర్సరీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయన్నారు. తెల్ల పొణికి లభ్యతను పెంచేలా ఫారెస్టు, డీఆర్‌డీఏ, డ్వామా తదితర శాఖల సమన్వయంతో కృషిచేయనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక జాయింట్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఒకవైపు అటవీ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు తెల్ల పొణికి కళాకారులకు అందుబాటులో ఉండేలా పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. కళను ప్రోత్సహించి, సంప్రదాయ కళా సంపదను భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎ.రాము, డీఎఫ్‌వో జి.సతీష్, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.