-మహిళా పక్షపాతిగా దేశానికే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శం
-137 పదవుల్లో 69 మహిళలకే ఇచ్చారు
-తాను మహిళా పక్షపాతినని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకున్నారు.
-ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కితాబు
అమరావతి, జూలై 18:
కొత్తగా కేటాయించిన కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులలో సమాజంలో అణగదొక్కబడిన మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక ప్రాధాన్యతనిచ్చారని, తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కితాబిచ్చారు. 137 నామినేటెడ్ పదవులలో 69 పదవులను మహిళలకే ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిది అరుదైన రికార్డు అని, మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శమని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఇంత గొప్పగా ప్రాముఖ్యతను ఇస్తున్న ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రిగా పని చేయడం తనకెంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు ఛేర్మెన్ లను ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం మీడియాకు విడుదల చెసిన ప్రకటనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛెర్మేన్ పదవుల కేటాయింపులో సమాజంలో అణగారిన వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని పుష్పశ్రీవాణి ప్రశంసించారు. సామాజిక న్యాయాన్ని పాటించడంలో, మహిళాసాధికారతకు చేయూతనివ్వడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరెవ్వరూ సాటికారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా నామినేటెడ్ పదవులలో ఎవరూ కూడా మహిళలకు 50 శాతం పదవులను ఇవ్వలేదని స్పష్టం చేసారు. తన కేబినెట్ లో ఒక మహిళను డిప్యుటీ సీఎంగా, మరో మహిళను హోంశాఖ మంత్రిగా నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన తరుణంలోనూ 50 శాతం మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చారని ప్రస్తావించారు. నామినేటెడ్ పనుల్లోనూ, పదవుల కేటాయింపుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని కితాబిచ్చారు. పదవుల కేటాయింపుల్లో ఇంతటి ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రికి మహిళలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకోసం ప్రకటించిన పదవుల సంఖ్య మొత్తం 137 కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే మొత్తం 79 పదవులు లభించాయని చెప్పారు. మొత్తం పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తొలిసారిగా 58 శాతం పదవులు రావడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రధమని అభిప్రాయపడ్డారు. వీటిలోనూ మహిళలకు ఎక్కువ పదవులు దక్కాయని, పదవులలో 50.4 శాతం మహిళలకే కేటాయించడం జరిగిందని తెలిపారు. 137 పదవుల్లో 69 పదవులు మహిళలకు దక్కగా, 68 పదవులు పురుషులకు దక్కాయని వివరించారు. జిల్లాలవారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 7 పదవులు ఇవ్వగా వీటిలో 4 పదవులు మహిళలకు దక్కాయన్నారు. ఆ జిల్లాకు ఇచ్చిన వాటిలో 86 శాతం పదవులు బడుగులకే లభించాయని చెప్పారు. విజయనగరం జిల్లాలో 8 మందికి పదవులు రాగా, వీటిలో 5 పదవులు మహిళలకు దక్కాయని, విశాఖపట్నం జిల్లాలో 11 మందికి పదవులు రాగా అందులో మహిళలకు 5 పదవులు లభించాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 మందికి పదవులివ్వగా అందులో 9 పదవులను మహిళలకే కేటాయించడం జరిగిందన్నారు. ప.గో.జిల్లాలో 12 మందికి కార్పొరేషన్ ఛైర్మన్లు ఇవ్వగా వారిలో 6 మంది మహిళలే ఉన్నారని తెలిపారు. కృష్ణా జిల్లాలో 10 మందికి పదవులు ఇస్తే వాటిలో 5 పదవులను మహిళలకే ఇవ్వడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలో 9 మందికి కార్పొరేషన్ పదవులు ఇస్తే, అందులో 4 పదవులను మహిళలకే ఇచ్చారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో 10 మందికి పదవులు ఇస్తే వారిలో 5 పదవులు మహిళలకే దక్కాయన్నారు. నెల్లూరు జిల్లాలో 10 పదవులు ఇస్తే అందులో 5 పదవులు మహిళలకే ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే చిత్తూరు జిల్లాలో 12 మందికి కార్పొరేషన్ ఛైర్మన్లు పదవులు ఇవ్వగా వీటిలో మహిళలకు 6 పదవులు లభించాయని పుష్ప శ్రీవాణి తెలిపారు. అనంతపురం జిల్లాలో 10 మందికి పదవులు ఇవ్వగా, వాటిలో 3పదవులు మహిళలకు వచ్చాయని, కడప జిల్లాలో 11 మందికి పదవులు ఇస్తే అందులో 5పదవులు మహిళలకే లభించాయన్నారు. కర్నూలు జిల్లాలో 10 మందికి పదవులు ఇస్తే, అందులో 5 పదవులను ముఖ్యమంత్రి మహిళలకే కేటాయించారని పుష్ప శ్రీవాణి వివరించారు.