జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో నివసిస్తున్న ప్రజలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యానగర్ కాలనీ లో ఇళ్ళు నిర్మించుకుని 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న విద్యానగర్ కాలనీ స్థలం దేవాదాయ శాఖ కు చెందిందని, వెంటనే ఆ స్థలాలను ఖాళీ చేయాలని ఆ ప్రాంత వాసులకు దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు దేవాదాయ శాఖ స్థలాలను విద్యానగర్ లో నివసిస్తున్న ప్రజలకు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విద్యానగర్ వాసులకు స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించి అందజేస్తామని హామీ ఇచ్చారు.
