-బ్రాహ్మణ కార్పొరేషన్/ క్రెడిట్ సొసైటి పథకాలపై అవగాహన సదస్సులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
-కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు సేవలను కొనియాడిన మంత్రి
-క్రెడిట్ సొసైటి.. బ్రాహ్మణుల బ్యాంకు : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పేద బ్రాహ్మణుల సహాయార్థం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. భవానీపురంలోని వీఎంసీ కళ్యాణ మండపంలో జింకా చ్రకధర్ అధ్యక్షతన బ్రాహ్మణ కార్పొరేషన్/ క్రెడిట్ సొసైటి పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా వంశపారంపర్య అర్చకత్వంపై ఇటీవల జీవో కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దేవాలయాలలో పనిచేసే అర్చకులకు 25శాతం అదనంగా జీతాన్ని పెంచామన్నారు. దేవాలయాలలో ధూపదీప నైవేథ్యాల కోసం రూ. 10 వేల నుంచి రూ. 35 వేల వరకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నేడు పురోహిత మిత్ర పథకం ద్వారా రూ. 42 లక్షలు, అరుంధతి, వశిష్ఠ పథకాల కింద రూ. 46.70 లక్షలు.. మొత్తంగా రూ. 88 లక్షల 70 లను 418 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. మరోవైపు అగ్రవర్ణ పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా.. గత తెలుగుదేశం ప్రభుత్వం ఓట్ల కోసం ఏకపక్షంగా ఒకే సామాజికవర్గానికి కేటాయించిందని మండిపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర నిబంధనలను సరళీకృతం చేసి.. అన్ని అగ్రవర్ణ సామాజికవర్గాలకు న్యాయం చేశారన్నారు.
అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవస్థను పటిష్ట పరిచారని చెప్పుకొచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ గా ఇంతకాలం బ్రాహ్మణ సామాజికవర్గానికి సేవలందించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికు ధన్యవాదాలు తెలియజేశారు. గత తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణులకు పెన్షన్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండేదని, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతిఒక్కరికీ అందజేయడం జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 15,500 మంది బ్రాహ్మణులకు మాత్రమే పింఛన్ అందుతుండగా నేడు ఆ సంఖ్యను 26 వేలకు పెంచడమైనదన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా భార్యభర్తలిరువురికీ పింఛన్ అందేలా జీవో తీసుకువచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇందుకోసం ఏటా రూ. 70 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చిన్నారుల తల్లులకు రూ. 26 కోట్లను అందించినట్లు తెలియజేశారు. వైఎస్సార్ ఆసరా కింద రూ. 15 కోట్లను అందించామన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతిలో క్రెడిట్ సొసైటీ కీలక భూమిక పోషిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే రెండేళ్ల క్రితం వరకు 52వేలు ఉన్న సభ్యత్వం నేడు 63 వేలకు చేరిందన్నారు. క్రెడిట్ సొసైటి అనేది బ్రాహ్మణుల బ్యాంకు అని కితాబిచ్చారు. కరోనా విపత్తు సమయంలోనూ పేద బ్రాహ్మణులకు సొసైటీ ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం హయాంలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించిన 10 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా విభజించారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో చర్చించి వివాదాలకు తావులేని రీతిలో మొదట విద్యావకాశాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. దీనిపై మరింత కసరత్తు అనంతరం సమగ్రంగా విధివిధానాలను నిర్ణయిస్తూ తాజాగా జీవో నెం.66 జారీ చేయడం జరిగిందన్నారు. మరోవైపు ఈబీసీ నేస్తం పేరుతో అగ్రవర్ణ పేద మహిళలకు చేయూతనందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 45 – 60 ఏళ్లలోపు వయసున్న వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పేద బ్రాహ్మణులు తమతమ పరిధిలోని వార్డు/ గ్రామ సచివాలయాలను ఆశ్రయించి ఈ పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పురోహిత మిత్ర, అరుంధతి, వశిష్ఠ పథకాల రుణాలకు సంబంధించి రూ. 88 లక్షల 70వేల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండీ సుసర్ల శ్రీనివాస్, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సీఈఓ గుళ్లాపల్లి నాగసాయి, బ్రాహ్మణ కార్పొరేషన్ జీఎం డా.అన్నప్రగడ కుమారస్వామి, కార్పొరేటర్లు కోటిరెడ్డి, చైతన్య రెడ్డి, గుడివాడ నరేంద్ర, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.