Breaking News

ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

-నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు
-26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
-పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష
-రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
-ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు
-నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు
-గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ
-ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుతో రికార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు నిర్లక్షం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్నిఇబ్బందులుపడ్డారో చూశామని, అందుకే ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.

ఏ రైసు మిల్లులో అయినా అమ్ముకునే సౌలభ్యం :
ధాన్యం అమ్మే రైతులు ఏ మిల్లుకు అయినా ధాన్యం పంపవచ్చు. గతంలో ప్రభుత్వం సూచించిన మిల్లులకు మాత్రమే రైతులు ధాన్యం పంపాల్సి ఉండేది. నాడు నెలల తరబడి ధాన్యం డబ్బులు రైతులకు జమ అయ్యేవి కావు. కానీ కూటమి ప్రభుత్వం 24 గంటల నుంచి 48 గంటల్లోపే ధాన్యం డబ్బు చెల్లిస్తోంది. రైతులు వాట్సాప్ ద్వారా తమ పంటను అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిచింది. సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, మిల్లర్లు, అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసింది.

అధికారులు, ఉద్యోగులదే బాధ్యత :
ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కింద స్థాయి ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందిపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. డ్రయర్ల (ధాన్యం ఆరబెట్టే యంత్రాలు) ఏర్పాటు ద్వారా తేమ విషయంలో తలెత్తుతున్న సమస్యలు ఎంతవరకు పరిష్కారం చూపవచ్చు అనేది కూడా చూడాలని సిఎం సూచించారు.

37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం :
సమీక్షలో ధాన్యం సేకరణ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని అన్నారు. నేటికి రూ.2,331 కోట్లు రైతులకు చెల్లించారు. ఇందులో రూ. 2,202 కోట్లు 24 గంటల్లో చెల్లించగా, మిగిలిన రూ.128 కోట్లు 48 గంటల వ్యవధిలో చెల్లించారు.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కొనుగోలు :
మొత్తం 14 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తుండగా, అందులో తూర్పు గోదావరి జిల్లాలో 1.84 లక్షల మెట్రిక్ టన్నులు, పశ్చిమ గోదావరిలో 1.81 లక్షల మెట్రిక్ టన్నులు, ఏలూరు జిల్లాలో 1.69 లక్షల మెట్రిక్ టన్నులు. కోనసీమలో 1.44 లక్షల మెట్రిక్ టన్నులు, కృష్ణాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. వీటితో పాటు మరో 9 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ సమయానికి కేవలం 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చెయ్యగా, ఇదే సమయానికి ఈ ఏడాది నేటికి 10,59,457 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశారు. అంటే గతేడాది కంటే రెంట్టింపు మొత్తంలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు జరపడంతో పాటు, 48 గంటల వ్యవధిలోనే మొత్తం 1.45 లక్షల మంది రైతులకు డబ్బులు చెల్లించడం జరిగిందని అధికారులు వివరించారు. తుఫాను ప్రభావం కారణంగా ఆందోళన చెందుతున్న రైతుల్ని అర్థం చేసుకుని, మరింత వేగంగా పెద్దఎత్తున ధాన్యం కోనుగోలు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం ధాన్యం సేకరణలో గత 10 రోజుల్లోనే 60 శాతం జరిపినట్లు అధికారులు తెలిపారు.

ధాన్యం సంచుల కొరత రానివ్వొద్దు :
రైతులు ధాన్యం సంచుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. వాట్సప్ ద్వారా కొనుగోళ్లు అని చెప్పాం.. దాని అమలు సక్రమంగా అవుతుందా లేదా.. ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది కూడా సరిచూసుకోవాలని సూచించారు. రైతులు తమ చుట్టూ తిరగాలనే సంస్కృతి కనిపించకూడదని అన్నారు. ఏ రైస్ మిల్లు వాళ్లు అయినా రైతులను ఇబ్బంది పెడతాం.. ప్రభుత్వానికి సహకరించం అంటే కుదరదని.. అలాంటి వారిపై చర్యలకు వెనుకాడొద్దని సిఎం కలెక్టర్లకు సూచించారు. మిల్లుల్లో లోడింగ్‌కు ఎక్కువ సమయం పట్టకుండా చూడాలని, వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేయాలని చెప్పారు.

ప్రతి రోజూ మీడియాకు ధాన్యం కొనుగోలు సమాచారం :
ఆయా జిల్లాల్లో ప్రతి రోజూ కొనుగోలు వివరాల మీడియా ద్వారా కలెక్టర్లు, అధికారులు ప్రజలకు వివరించాలని, తద్వారా ప్రజలకు సమాచారం అందుతుందని సీఎం అన్నారు. రైతుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం తీసుకుంటున్నాం. వారి నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోతే దానికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే ఈ సారి తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళతానని, అక్కడి నుంచే అధికారులను వివరణ కోరుతానని సీఎం అన్నారు. ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉండి.. అన్ని విధాలుగా మద్దతుగా ఉండి కూడా అధికారులు, ఉద్యోగుల వైఫల్యం వల్ల చెడ్డపేరు వస్తే ఎందుకు సహించాలని సీఎం అన్నారు. తేమ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా రైతుల కోసం ఏం చెయ్యవచ్చు అనేది చూడాలన్నారు.

బియ్యం స్మగ్లింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు :
రాష్ట్రంలో రేషన్ బియ్యం రీ సైక్లింగ్, స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకమై ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. బియ్యం స్మగ్లింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు, ఇకపై ఎక్కడా స్మగ్లింగ్ జరగకుండా చూడాలని ఆదేశించారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *