-డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతాం
-త్వరలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
-మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల అనుసంధానంతో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకే మెగా పేరెంట్స్ డే ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక మున్సిపల్ గర్ల్స్ పార్క్ హై స్కూల్ నందు శనివారం మెగా పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఆర్యోక్తి, తల్లిదండ్రులు మనకు జన్మనివ్వగా, సమాజంలో నడుచుకునే విధానం, విద్య నేర్పేది ఉపాధ్యాయులు, మన ఉన్నతిని ఆశించే గురువులను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో 18 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. నేటి సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధి చేయడంతో పాటు డ్రాప్స్ అవుట్స్ నివారణకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారి మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ దే అన్నారు.
త్వరలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చేయడమే తార్కాణం అన్నారు. మహిళల్లో చైతన్యం తేవడానికి స్వర్గీయ ఎన్టీఆర్ తిరుపతిలో దేశంలో తొలిసారి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు.
తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పుట్టిన గడ్డకు మంచి పేరు తేవాలని విద్యార్థులు ప్రతిరోజు తమ మనసుల్లో భగవంతుని ప్రార్థించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా ఉంటూ సెల్ ఫోన్ అవసరం మేరకే వినియోగించేలా చూడాలని మంత్రి సూచించారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. పాఠశాల స్థాయిలోనే ఈగల్ ఫోర్స్ టీమ్ లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇన్నోవేషన్స్ కోసం మచిలీపట్నం నేషనల్ కాలేజీలో త్వరలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 2025 జనవరి 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ పార్క్ గర్ల్స్ హైస్కూల్లో గత ఏడాది పదవ తరగతిలో 90% ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తామని అన్నారు. అనంతరం మంత్రి తల్లిదండ్రులచే తమ పిల్లలను ప్రతిరోజు బడికి పంపుతామని, వారి విద్యా, మానసిక, నైతిక వికాసానికి చేయూతనిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
మాజీ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారని, అందుకే తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రభుత్వం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. వారానికోసారైనా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని, విద్యార్థులు సెల్ ఫోన్ దుష్పరిణామాలకు గురికాకుండా చూడాలని సూచించగా, డీఈవో వెంటనే స్పందించి సోమవారం నుండి శనివారం వరకు రోజుకో తరగతి చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి రామకృష్ణను డీఈవో ఆదేశించారు. ఈ పాఠశాలలో స్కూల్ అవర్స్ లో ఉపాధ్యాయులు సెల్ఫోన్ వినియోగం నిషేధం ఇప్పటికే అమలు చేస్తున్నట్లు డీఈవో తెలిపారు.
డీఈవో పివిజె రామారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పిల్లల అన్ని రకాల సామర్ధ్యాలు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు లో ప్రస్ఫుటం చేస్తూ, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తెలియజేస్తూ వారికి అందిస్తున్నట్లు తెలిపారు. మహిళా పోలీస్ హేమలత సైబర్ నేరాల గురించి విద్యార్థినిలకు వివరించారు.
తల్లిదండ్రులలో మహిళలకు రంగోలి, పురుషులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించగా, విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. పూర్వ విద్యార్థిని బి. పద్మ ఈ పాఠశాలలో కష్టపడి చదివి త్రిపుల్ ఐటీ లో సీటు సాధించిన విషయం విద్యార్థులతో పంచుకుని, తనలాగా కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. రామకృష్ణ పాఠశాల సమగ్ర నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు బండి రామకృష్ణ, సోడిశెట్టి బాలాజీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్ పర్సన్ ఆదిలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యోన్నతికి పలువురు తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు ఉపాధ్యాయులతో పంచుకున్నారు.
బందరు మండల ఎంఈఓ దుర్గాప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక డివిజన్ ఇంచార్జ్ రాంబాబు వందన సమర్పణ గావించారు. డి ఎం హెచ్ వో డాక్టర్ జి గీతాబాయి, పలువురు స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.