-జోన్‌లోని 38 మంది ఉద్యోగులకు ‘‘మ్యాన్ ఆఫ్ ది మంత్’’ అవార్డుల ప్రదానం
-వర్షా కాలంలో ముందు జాగ్రత్త చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి : జీఎమ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి అవాంఛనీయ ఘటనల నివారణకు అప్రమత్తంగా ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన జోన్‌లోని 38 మంది ఉద్యోగులకు ‘‘మ్యాన్ ఆఫ్ ది మంత్’’ భద్రతా అవార్డులను ప్రదానం చేశారు. 19 జులై 2021 తేదీన సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుండి వర్చువల్‌గా నిర్వహించిన భద్రతా సమావేశం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మరియు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో పాటు విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్ల రౖౖెల్వే మేనేజర్లు (డీఆర్‌ఎమ్‌లు) కూడా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
జోన్‌లోని 38 మంది ఉద్యోగులకు గజానన్ మాల్య ‘‘మ్యాన్ ఆఫ్ ది మంత్’’ అవార్డులను వర్చువల్ ద్వారా ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలు సంబంధిత డివిజన్ల డివిజినల్ రైల్వే మేనేజర్ల చేతులమీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని 8 మంది ఉద్యోగులు, హైదరాబాద్ డివిజన్‌లోని ఇద్దరు ఉద్యోగులు, విజయవాడ డివిజన్‌లోని 14 మంది ఉద్యోగులు, గుంతకల్ డివిజన్‌లోని 9 మంది ఉద్యోగులు, గుంటూరు డివిజన్‌లోని ఇద్దరు ఉద్యోగులు, నాందేడ్ డివిజన్‌లోని ముగ్గురు ఉద్యోగులు ఈ అవార్డులను అందుకున్నారు. లోకోపైలట్లు, స్టేషన్ మాష్టర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మ్యాన్, కీ మ్యాన్, ట్రాక్ మ్యాన్, గేట్ మ్యాన్ మొదలగు కేటగిరీలకు చెందిన ఉద్యోగులు ఈ అవార్డులు అందుకున్నారు. జనరల్ మేనేజర్ జోన్‌లో భద్రతా చర్యలను ప్రధానంగా రబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై సమీక్షించారు. వర్షాల తీవ్రతను బట్టి పెట్రోలింగ్ చేస్తూ మరియు సమస్యాత్మకమైన/సున్నితమైన ప్రాంతాలన్నింటినీ గుర్తించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించిన ఆర్‌యూబీలు, పరిమితి ఎత్తు గల సబ్‌వేల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాక్ ప్రామాణికతలను క్రమంగా పర్యవేక్షించాలని ఆయన డివిజినల్ అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ పరిస్థితుల నివారణకు సంబంధిత విభాగాలు మరియు సూపర్‌వైజర్లతో కలిసి పని ప్రదేశాలలో భద్రతా చర్యలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు. ఆయన జోన్‌లో సరుకు రవాణా లోడిరగ్‌పై సమీక్షించారు మరియు జోన్‌లో కొనసాగుతున్న వివిధ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పనులకు సంబంధించిన పనుల పురోగతిని కూడా పరిశీలించారు.