-నేడు గిద్దలూరు నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామం వద్ద కోనపల్లి రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా.. రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలో వరుసగా జిల్లాల పర్యటనలు
-ఆర్ధిక ఇబ్బందులున్నా ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో రూ. 861 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతు పనులు
-ప్రకాశం జిల్లాలో దాదాపు రూ. 21 కోట్లతో 1313 కి.మీ రహదారుల మరమ్మతు పనులు చేపట్టాం
-త్వరలో 1300 కి.మీ రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నాం
– గత 5 ఏళ్లలో ప్రభుత్వం రోడ్లను రెన్యువల్ చేయకపోవడంతో నేడు అదనంగా ప్రభుత్వంపై రూ. 15 వేల కోట్ల భారం
-మోడీ, బాబు, పవన్ త్రయం ఆధ్వర్యంలో రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్… ముఖ్యమంత్రి స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల వద్దకే పాలన అందించే దిశలో మా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. నేడు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో బెస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కోనపల్లి రోడ్డు మరమ్మతు పనులను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా.. రోడ్ల మరమ్మతు పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో మంత్రి పర్యటిస్తోన్నారు. ఇప్పటికే అన్నమయ్య, బాపట్ల, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్ల మరమ్మతు పనులను ప్రత్యక్షంగా మంత్రి పర్యవేక్షించడం జరిగింది. సంక్రాంతికి ఇంకా నెల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. మరమ్మతు పనులను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు మంత్రి సూచించడం జరిగింది. అలాగే స్థానిక ప్రజలను అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్న తీరుపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రానికి రహదారులు కీలకమని భావించి నేడు రూ. 861 కోట్ల నిధులతో దాదాపు 25 వేల కి.మీ రహదారుల పనులను 3 విడతలుగా ప్రారంభించామన్నారు. నేడు ప్రకాశం జిల్లాలో దాదాపు రూ. 21 కోట్లతో 1313 కి.మీ రహదారుల మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు. జనవరి 15 నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. అయితే కొన్ని చోట్ల వర్షం వల్ల మరమ్మతు పనులు కొంతమేర ఆలస్యం అయినప్పటికీ జనవరి ఆఖరుకు గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
గత పాలకులు నిర్లక్ష్యంతో కనీస మౌలిక సదుపాయాలు లేక రాష్ట్రంలో పరిశ్రమలు, టూరిజం వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. గతంలో రోడ్లను చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి రాలేని పరిస్థితి నెలకొందన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఎక్కడా కూడా రోడ్లను రెన్యువల్ చేసిన పాపాన పోలేదు.. దీంతో నేడు అదనంగా రోడ్లపై రూ. 15 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన స్థితికి తీసుకొచ్చారన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారు.. ఏ శాఖలో చూసినా, ఏ నిధులు ఎక్కడున్నాయో తెలియని అయోమయస్థితికి రాష్ట్రంలో పాలన తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో NDB పనులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాబార్డు నుంచి వచ్చిన నిధులకు కూడా కనీసం యూసీలు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్ & బీ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు, బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్ & బీ కాంట్రాక్టర్లకు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలు రోడ్డున పడ్డ దుస్థితి నెలకొందన్నారు.
నేడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహాకారంతో రూ. 75 వేల కోట్లు జాతీయ రహదారుల పనులు రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు, ఆ పనులకు కూడా త్వరలో టెండర్లు పిలవనున్నమన్నారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో ద్వారా కొన్ని రహదారులను ఎంపిక చేసి, రూ.. 47 కోట్లతో ఏజెన్సీల ద్వారా సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నామన్నారు. త్వరలో ఈ 1300 కి.మీ రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ది చేయాలని భావిస్తున్నామని, మార్చి లోపు పనులు ప్రారంభించి.. గతంలో టీడీపీ హాయాంలో మాదిరిగా సౌకర్యవంతమైన రోడ్లను ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లను కల్పించడంతో పాటు, మౌలిక వసతుల కల్పన ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రంలో మళ్లీ వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రంలోకి రానున్నాయని, ఒక ఏడాదిలోపు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడమే లక్ష్య్యంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. 161 సీట్లతో భారీ విజయాన్ని అందించిన ప్రజల రుణం తీర్చుకోవడంతో పాటు, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. మోడీ, బాబు, పవన్ త్రయం ఆధ్వర్యంలో రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.