-మార్కెట్ నెట్‌వర్క్ విస్తరణ, చేనేత ఉత్పత్తులకు న్యాయమైన ధర నిర్ధారణ
-కార్మికుల ఆరోగ్య, విద్య అవసరాల కోసం ప్రత్యేక శ్రద్ధ
-పవర్ లూమ్స్ కన్నా హ్యాండ్ లూమ్స్ కి ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలి
-కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్
-రాష్ట్రంలో చేనేత పరిశ్రమలకు పూర్వ వైభవం తీసుకొస్తాం
-రాష్ట్ర బిసి సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రి ఎస్.సవిత
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై ప్రాధాన్యం చూపుతామని, మార్కెట్ నెట్‌వర్క్ విస్తరణ, చేనేత ఉత్పత్తులకు న్యాయమైన ధర నిర్ధారణ చేయుటకు ప్రయత్నిస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆదివారం మద్యాహ్నం స్థానిక పద్మావతి అతిధి గృహం నందు కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రి శ్రీమతి ఎస్.సవిత, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణిలతో కలిసి చేనేత,ఆప్కో,టెక్స్టైల్స్ రంగాల అభివృద్దిపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో చేనేత రంగాన్ని కాపాడి, అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కార్మికుల ఆరోగ్య, విద్య అవసరాల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంలో గల చేనేత కార్మికులకు కావలసిన సదుపాయాలను కల్పిస్తామని, వారికి అండగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, చిన్న సన్న చేనేత కార్మికులకు మగ్గాలు ఏర్పాటు చేసుకొనుటకు కేంద్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కావలసిన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి సవిత గారితో సమీక్షా సమావేశం నిర్వహించామని, చేనేత మరియు హస్త కలలపై సంపదను సృష్టించే అంశం పై సమీక్షించి అభివృద్ధి కృషి చేస్తామని, అలాగే టెక్స్టైల్స్, కలంకారి, హస్త కల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
రాష్ట్ర బిసి సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని పత్తి పంట సాగు, పత్తి నిల్వ, కాలుష్య శాతం తగ్గించడానికి మగ్గాలు పత్తి పంటను రక్షించడానికి ఉత్పాదకత పెంచడం, జానపనార ఉత్పత్తులు చేనేత శాఖలోని అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాల గురించి కేంద్ర మంత్రికి తెలియజేశారు. ధర్మవరంలో చేనేత కార్మికుల అభివృద్ధికి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు రూ.35.80 కోట్లు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిఠాపురం జిల్లాలోని చేనేత కార్మికుల అభివృద్ధికి రూ.15 కోట్లు చొప్పున, పెనుగొండ నియోజకవర్గంలో మగ్గాలు ఉపకరణాలు వ్యక్తిగత వర్క్ షాపుల నిర్మాణం కొరకు రూ.6.27 కోట్లు, తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామం చేనేత మరియు హస్తకళ మ్యూజియం ఏర్పాటుకు రూ. 15 కోట్లు, అమరావతి సంస్థ ఏర్పాటుకు రూ.280 కోట్లు, PM- MITRA కింద మెగా టెక్స్టైల్స్ పార్కు 1000 ఎకరాల భూమిలో ఏర్పాటు కొరకు రూ.800 కోట్లు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, మైలవరం, ఎమ్మిగనూరులలో 5 మినీ చేనేత/జౌళి క్లస్టర్ల మంజూరు కొరకు రూ.200 కోట్లు కోరుతూ ప్రతిపాదనలను కేంద్రమంత్రి కి అందజేశారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గారు ఆ ప్రతిపాదనలు పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల తయారీపై కేంద్ర మంత్రిగారికి వివరించడం జరిగిందని, చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సరఫరా పథకం, నేత కార్మికుల ముద్ర స్కీం వంటి వాటిపై అవగాహన కల్పించాలని…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకుంటే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంటుందన్నారు.
రాష్ర చేనేత, జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత, జౌళి రంగాల వారికి కాటన్ రీసైకిల్, ఫైబర్ పాలిస్టర్ తో కాటన్ జోడించడం, జూట్ సాగు ఉత్పత్తి సాగు విస్తీర్ణం, జనపనార ఉత్పత్తి పెంచడం, చేనేత వస్త్రాలను వాడకంలోకి తీసుకురావడం వాటి విలువ పెంచడం మార్కెటింగ్, హస్తకళలు, చేనేతరంగం అభివృద్ధి, కేంద్ర సామాగ్రి మరియు ఎగుమతులు పెంచడం, కాటన్ రీసైకిల్ ఉత్పత్తులు వాడకం ద్వారా చేనేత వాడకం పెంచడం వృత్తి నైపుణ్యం కొరకు శిక్షణ, చేనేత కార్మికులకు పని కల్పించడం మొదలైన అంశాలు విస్కోస్ నూలు దిగుమతులు తగ్గించి ఉత్పాదకథ పెంచడం వలన చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ముందు చూపుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయముతో అభివృద్ధి చేయుటకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అండ్ మానేజింగ్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ , ఆప్కో ఎం. విశ్వ, అడిషనల్ డైరెక్టర్ హ్యాండ్ లూమ్స్ & టెక్స్టైల్స్ శ్రీకాంత్ ప్రభాకర్, అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ సంబందిత అధికారులు పాల్గొన్నారు.